| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘోరం! గర్భిణి అని చూడకుండా భార్యను చంపి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్!?

ఘోరం! గర్భిణి అని చూడకుండా భార్యను చంపి  గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్!?

భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం... గర్భవతి అయిన భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన కానిస్టేబుల్ అరెస్ట్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:రక్షించాల్సిన రక్షకభటుడే భక్షకుడిగా మారాడు. కట్టుకున్న భార్య అని చూడకుండా, పైగా ఆమె గర్భవతి అనే కనికరం కూడా లేకుండా అతి కిరాతకంగా అంతమొందించాడు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి గోదావరి నదిలో పడేసిన దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

ఈ కేసులో నిందితుడైన ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం మీడియాకు ఈ కేసు వివరాలను వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ప్రేమ వివాహం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలానికి చెందిన బొడా నరేందర్ కొత్తగూడెం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా (ARPC-623) విధులు నిర్వహిస్తున్నాడు. ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రాంతానికి చెందిన భవాని (30) తో రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కొత్తగూడెంలోని ప్రగతినగర్‌లో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ప్రస్తుతం భవాని 3-4 నెలల గర్భవతి.

క్షణికావేశంలో ఘాతుకం..

గత కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో నిరంతరం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 3వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ మరింత ముదిరింది. క్షణికావేశానికి లోనైన నరేందర్.. భవాని చున్నీతోనే ఆమె గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు.

తండ్రితో కలిసి మృతదేహం మాయం

హత్య జరిగిన తర్వాత పట్టుబడతామనే భయంతో, నేరాన్ని దాచేందుకు నరేందర్ దారుణమైన ప్లాన్ వేశాడు. శవాన్ని రోజంతా ఇంట్లోనే ఉంచి, అనంతరం తన తండ్రి బొడా హరిలాల్ సహాయంతో ఒక గోనె సంచిలో మూటగట్టాడు. నవంబర్ 4వ తేదీ రాత్రి బైక్‌పై మృతదేహాన్ని తరలించి భద్రాచలం గోదావరి వంతెన పైనుంచి నదిలోకి పడేసి ఏమీ తెలియనట్లు తిరిగొచ్చాడు. అయితే, మృతదేహాన్ని బైక్‌పై తరలిస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఆత్మహత్య డ్రామా.. పోలీసుల విచారణలో గుట్టు రట్టు!

మరోవైపు భవాని ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోగా నరేందర్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సరికొత్త డ్రామాకు తెరలేపాడు. గురువారం రాత్రి కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన భార్య ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని పోలీసుల వద్ద నమ్మించే ప్రయత్నం చేశాడు.

కానీ, అతని మాటల్లోని తడబాటు, పొంతన లేని సమాధానాలను గమనించిన పోలీసులు తమదైన శైలిలో గట్టిగా విచారించడంతో అసలు నిజం బయటపడింది. తానే భార్యను చంపేసి గోదావరిలో పడేసినట్లు నిందితుడు అంగీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

నదిలో లభ్యమైన శవం.. తండ్రి పరారీ!

నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో గోదావరి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం బూర్గంపాడు మండలం గుమ్మూరు సమీపంలో నది ఒడ్డున భవాని మృతదేహం లభ్యమైంది. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘోరానికి పాల్పడిన కానిస్టేబుల్ బొడా నరేందర్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. మృతదేహం తరలింపులో సహాయం చేసిన నరేందర్ తండ్రి హరిలాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

#డైలీభారత్ #Kothagudem #CrimeNews #DailyBharath

Previous సూర్యాపేటలో భారీ గంజాయి పట్టివేత! నలుగురు అరెస్ట్, ఇద్దరు పరార్!
Next జూలూరుపాడులో కులాలన్నీ ఒకే వేదికపై... సామాజిక సమరసతే జాతీయ సమైక్యతకు పునాది!
ADVERTISEMENT