మహిళా రక్షణ సంఘం భద్రాచలం డివిజన్ అధ్యక్షురాలు చిట్టి మల్ల సుజాత
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం చర్ల వెంకటాపురం వాజేడు మండలాల్లో బహిరంగ మార్కెట్లో అడ్డగోలుగా పెరిగిన బియ్యం ధరలను ప్రభుత్వం తక్షణమే నియంత్రించాలని మహిళా రక్షణ సంఘం నాయకురాలు చిట్టిమల్ల సుజాత డిమాండ్ చేశారు. చర్ల మండల కేంద్రంలో జరిగిన మహిళా రక్షణ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ బియ్యం ధరల అక్రమ పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, వరి సాగు విస్తీర్ణం తగ్గడం, పంట దిగుబడిపై నెలకొన్న ఆందోళనలను కొందరు రైస్ మిల్లర్లు, దళారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని సుజాత విమర్శించారు. ఇదే అదనుగా కుమ్మక్కై బియ్యాన్ని గోదాముల్లో అక్రమంగా నిల్వ చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి, ఇతర రాష్ట్రాలకు ధాన్యాన్ని తరలిస్తూ స్థానికంగా సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సన్న బియ్యం కిలో ధరను రూ. 66 నుండి రూ. 79గా అధికారికంగా నిర్ణయించినప్పటికీ, కిరాణా షాపుల్లో మాత్రం 25 కేజీల బ్యాగ్‌ను ఏకంగా రూ. 2,300 నుండి రూ. 2,500 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ విపరీతమైన ధరల పెంపుతో నిరుపేదలు, రోజువారీ కూలీల కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా తలకిందులైందని పేర్కొన్నారు. పౌరసరఫరాల అధికారులు వెంటనే మిల్లులు, షాపులపై విస్తృత దాడులు నిర్వహించాలని సుజాత కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించేలా చర్యలు తీసుకోకపోతే, నియోజకవర్గంలోని అన్ని మండల లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళలతో కలిసి పెద్దఎత్తున ధర్నా చేపడతామని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో మహిళా రక్షణ సంఘం నాయకులు వెంకటలక్ష్మి, సంధ్య, దేవి, రాధా తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు