డైలీ భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం జరిపిన మెరుపు దాడిలో ఒక అవినీతి పోలీస్ అధికారి అడ్డంగా బుక్కయ్యారు.
ఓ కేసు విషయంలో న్యాయం చేయాలంటూ స్టేషన్‌కు వచ్చిన ఒక బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా బజార్‌హత్నూర్ ఎస్సై రమేష్ ఏసీబీ వలకు చిక్కారు.
అసలేం జరిగిందంటే:
ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ జి. రమేష్ రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బుధవారం నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్‌లో ఆయన పట్టుబడ్డారు. ఏసీబీ ప్రెస్ నోట్ నెం.169 ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పెళ్లికాని యువతి అనుమానాస్పద ఆత్మహత్య కేసులో ఫిర్యాదుదారుడిని నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు, అతని మొబైల్ ఫోన్ తిరిగి ఇచ్చేందుకు తొలుత రూ.50 వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ.. చర్చల అనంతరం రూ.40 వేలకు ఒప్పుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
యువతి చనిపోయే ముందు చివరిసారిగా ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసింది. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని కేసులో ఇరికిస్తానని బెదిరించడంతో పాటు, తన వద్ద ఉంచుకున్న ఫిర్యాదుదారుడి మొబైల్ ఫోన్ తిరిగి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు సెక్షన్ 194 BNSS కింద నమోదైంది.
నవంబర్ 4న గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో సెంటరింగ్ బాక్సుల కింద రూ.40 వేలు పెట్టాలని ఎస్ఐ సూచించగా.. ఫిర్యాదుదారుడు అలాగే చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్ఐని పట్టుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.
ఎస్ఐని అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలు భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచారు.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ప్రజలకు సూచించింది. వాట్సాప్ - 9440446106, ఫేస్‌బుక్ - Telangana ACB, X - @Telangana ACB ద్వారా కూడా సంప్రదించవచ్చు.
#Adilabad #ACBRaid #Bazarhatnoor #SIRamesh #Bribe #TelanganaACB