డైలీ భారత్, హైదరాబాద్: ₹90 చిల్లర వివాదంలో ప్రాణాలు కోల్పోయిన TGSRTC మహిళా కండక్టర్ గండ్ల ప్రవళిక పార్థివదేహానికి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఘన నివాళులు అర్పించారు.
ప్రవళిక తల్లిని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం & ఆర్టీసీ నుండి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుండి కోటి రూపాయలు ప్రమాద భీమా అందనుంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ:
"ఆర్టీసీ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ సంఘటన జరగగానే మేనేజ్మెంట్ తరఫున ఆసుపత్రికి వెళ్ళినాము, మంచి చికిత్స అందించే ప్రయత్నం చేసినాం కానీ దురదృష్టవశాత్తూ కండక్టర్ ప్రవళిక దూరమైంది.
ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు కలుగజేస్తది, అదే సందర్భంలో కార్మికుల సంక్షేమము, భద్రత ముఖ్యం. ఇటువంటి అంశాల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరినాం.
ఈ సంఘటనలో దోషి హత్య ప్రయత్నం కింద ఉండి ఇప్పుడు హత్య కేసు నమోదు చేసి తగిన విధంగా కఠిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగొద్దు.
ఒకవేళ మా సిబ్బంది ఎక్కడైనా పొరపాటుగా ప్రవర్తించినారంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి, చర్యలు తీసుకుంటాము. కానీ నేరుగా మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకొని తోసివేయడం వల్ల ఇవాళ ఒక కుటుంబం రోడ్డున పడ్డది. ఆ కుటుంబానికి ఆర్టీసీ అండగా ఉంటుంది.
వారి తల్లికి ఉద్యోగంతో పాటుగా ఒక ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఆర్టీసీ తరఫున 10 లక్షలు ఇవ్వడంతో పాటుగా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం వల్ల వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల్ని వారికి కంపెన్సేషన్ కింద బ్యాంక్ తరఫున వస్తుంది. ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకున్నా సభ్యురాలు కోల్పోయిన బాధను ఎవరు తీసుకురాలేము.
మేము పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కార్మికుల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఎక్కడ కూడా కార్మికుల లోపల అసహనం అనేది లేకుండా వారి పట్ల పెండింగ్ లో ఉన్న అన్ని నిర్ణయాలు తీసుకున్నాం.
చాలా క్రమశిక్షణ తోటి కాకీ బట్టల సంస్థగా ఆర్టీసీ ముందుకు వస్తది. దయచేసి ప్రయాణికులే దేవుళ్ళు, కస్టమరే దేవుడు అన్నట్టుగా ప్రయాణికుల సౌకర్యం కలుగజేయడం మన బాధ్యత. ప్రయాణికుల ద్వారా కూడా ఏమైనా అసౌకర్యం కలిగితే మనం కూడా చట్టం ముందు ఫిర్యాదు చేద్దాం.
సంక్షేమ విషయంలో మా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. వాళ్ళ భద్రత మా ప్రాధాన్యత, ప్రయాణికుల సౌకర్యం కూడా అంతే ప్రాధాన్యత. పరస్పరమైన ఇబ్బంది కలిగితే చట్టంలో ఫిర్యాదులు చేసుకోవాలి తప్ప ఇటువంటి సంఘటనలకు పాల్పడొద్దు."