| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘోరం: ₹90 చిల్లర వివాదమే ప్రాణం తీసింది... బస్సులోంచి తోసేయడంతో మహిళా కండక్టర్ ప్రవళిక కన్నుమూత

ఘోరం: ₹90 చిల్లర వివాదమే ప్రాణం తీసింది... బస్సులోంచి తోసేయడంతో మహిళా కండక్టర్ ప్రవళిక కన్నుమూత

డైలీ భారత్, మణుగూరు: కేవలం ₹90 చిల్లర వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. TGSRTC మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ గండ్ల ప్రవళిక (24) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని సాయి సంజీవని ప్రైవేట్ ఆసుపత్రిలో 10 రోజులుగా ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు.

అసలేం జరిగింది?

గత నెల అక్టోబర్ 25న మణుగూరు నుండి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో ఈ దారుణం జరిగింది. అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన బానోత్ మౌనిక తన కొడుకుతో కలిసి కల్యాణపురం స్టేజ్ వద్ద బస్సు ఎక్కింది. ఆధార్ చూపించి జీరో టికెట్, కొడుకుకు హాఫ్ టికెట్ (₹10) కోసం ₹100 నోటు ఇచ్చింది.

చిల్లర లేకపోవడంతో కండక్టర్ ప్రవళిక ₹90 బాకీని టికెట్ వెనుక రాసి, దిగేటప్పుడు ఇస్తానని చెప్పారు. అయితే ఇప్పుడే కావాలని మౌనిక గొడవకు దిగింది. బస్సు మిట్టగూడెం చేరుకునేసరికి వాగ్వాదం తీవ్రమైంది. ఫుట్‌బోర్డ్ వద్ద నిలబడిన ప్రవళికను మౌనిక కదులుతున్న బస్సులోంచి బలంగా తోసేసింది. ప్రవళిక రోడ్డుపై పడిపోవడంతో వెనుక చక్రాలు ఆమె రెండు కాళ్లపై నుంచి దూసుకెళ్లాయి.

10 రోజుల పోరాటం:

తీవ్రంగా గాయపడిన ప్రవళికను మొదట భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుండి హైదరాబాద్‌కు తరలించారు. కానీ మంగళవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.

కుటుంబ నేపథ్యం:

కారుణ్య నియామకం కింద 10 నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన ప్రవళిక తండ్రి నాగరాజు (RTC మెకానిక్) మరణించడంతో ఆమెకు ఉద్యోగం వచ్చింది. మరికొద్ది నెలల్లో పెళ్లి కావాల్సిన యువతి ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబంలో విషాదం అలముకుంది.

ప్రభుత్వ చర్యలు:

- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

- ₹10 లక్షల ఎక్స్‌గ్రేషియా, తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ప్రకటించారు

- నిందితురాలు మౌనికను అశ్వాపురం పోలీసులు అరెస్ట్ చేశారు

- కేసును మర్డర్ కేసు కింద మార్చాలని TGSRTC MD భద్రాద్రి ఎస్పీని కోరారు

- ఖమ్మం రీజియన్‌లో JAC ఆధ్వర్యంలో నేడు (నవంబర్ 4) మణుగూరు డిపో బంద్ 

Previous ఎల్‌నినో ఎఫెక్ట్: హైదరాబాద్‌లో నీటి కటకట - దీపావళి వరకు కార్పొరేట్ కాలేజీలకు సెలవులు
Next ఘోర ప్రమాదం : పూజా దీపం వల్ల అంటుకున్న గ్యాస్ సిలిండర్... CCTV ఫుటేజ్ వైరల్!
ADVERTISEMENT