డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఆర్ఎమ్, జీఆర్ఎమ్, సమన్వయ, సహాయోగ్ తదితర ఆధునిక పోర్టల్స్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఉత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణ పోలీస్ యూనిట్లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది.
సైబర్ నేరాల నియంత్రణ, ఫిర్యాదుల పరిష్కారం, సమాచార మార్పిడి తదితర అంశాల్లో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగిస్తూ సైబర్ క్రైమ్ సిబ్బంది కనబరిచిన ప్రతిభకు ఈ గుర్తింపు దక్కింది.
ఈ సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఉత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సైబర్ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం పట్ల అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, బాధితులకు వేగంగా న్యాయం అందించేందుకు మరింత సమన్వయంతో పనిచేస్తామని సిబ్బంది తెలిపారు.