రాజన్న సిరిసిల్ల (డైలీ భారత్): వేములవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల సంరక్షణను గాలికి వదిలేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారం, నీరు అందక కోడెలు చనిపోతుంటే ఆలయ యంత్రాంగం నిద్రపోతోందా అని ప్రశ్నించారు. దేవుడి పేరిట రాజకీయం చేసే ఎంపీ బండి సంజయ్ కోడెల మరణాలపై ఎందుకు నోరు విప్పరని సూటిగా ప్రశ్నించారు.
రాజన్న గుడిలో కాంక్రీట్ కట్టడాలు వద్దని, ఆగమశాస్త్రం ప్రకారం కృష్ణశిలతోనే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధికి 250 కోట్ల నిధులున్నాయని, తాత్కాలిక కాంక్రీట్ పనులతో చేతులు దులుపుకోవద్దని హెచ్చరించారు.
రాజన్న చెరువు దుర్గంధంతో భక్తులు, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వెంటనే ప్రక్షాళన చేయాలని కోరారు. వేములవాడ పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విప్ ఆది శ్రీనివాస్ రాజకీయ పెత్తనం కోసమే సిరిసిల్ల యార్న్ డిపోను వేములవాడకు మార్చారని సంచలన ఆరోపణ చేశారు. సిరిసిల్ల నేతన్నలను రోడ్లపాలు చేస్తూ ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలకు చుక్క నీరు కూడా అందలేదని విమర్శించారు. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న రుద్రంగి రిజర్వాయర్, కాలువల పనులు పూర్తిచేసి 63 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని, ధూమ్‌పేట వద్ద వరద కాలువ నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి వేములవాడ, కోనరావుపేట, చందుర్తి భూములకు నీళ్లివ్వాలని విజ్ఞప్తి చేశారు.