Posted on 2026-08-20 17:06:43
కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు అధికారుల పర్యవేక్షణ
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు
22ఏ సమస్యను ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని పనిచేయాలి
అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం
డైలీ భారత్, హైదరాబాద్:22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి దరఖాస్తును కేవలం ఒక ఫిర్యాదుగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి గారు స్పష్టం చేశారు. నిజమైన హక్కుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
22ఏ ఫిర్యాదులకు సంబంధించి ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు వస్తున్న కాల్స్, వాటి పరిష్కారం, ఏయే సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి, వచ్చిన కాల్స్‌కు ఎలాంటి సమాచారం అందిస్తున్నారు తదితర అంశాలపై బుధవారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి గారు సమీక్షించారు. నాలుగు జిల్లాల్లో 22ఏ అంశంపై ప్రస్తుత పరిస్థితి, దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి వదిలేయకుండా, దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత తహసీల్దార్, ఆర్డీవో, సబ్‌రిజిస్ట్రార్ తదితర అధికారులకు పంపించాలని ఆదేశించారు. ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు దాని పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
కాల్ సెంటర్ నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు స్వీకరించిన అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుపై నిజానిజాలను నిర్ధారించి, దరఖాస్తుదారు పేర్కొన్న సమస్య వాస్తవమా? భూమి 22ఏ జాబితాలోకి ఎందుకు వచ్చింది? దరఖాస్తుదారుడికి అర్హత ఉందా? అనే అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. పరిశీలన అనంతరం స్పష్టమైన కారణాలతో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యను చెప్పిన తర్వాత పరిష్కారం కోసం మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే సబ్‌రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్ల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు, గడచిన రెండు మూడు రోజుల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఇకపై కొత్తగా వచ్చే దరఖాస్తులు పెండింగ్‌లో పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
22ఏ సమస్య పరిష్కారాన్ని ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
“రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన వ్యక్తి తన సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకంతో బయటకు వెళ్లాలి. వచ్చిన దరఖాస్తును మరో కార్యాలయానికి పంపించి చేతులు దులుపుకోకండి. చివరి వరకు పర్యవేక్షించండి. మీ పనితీరుతో ప్రజల అభిమానాన్ని చూరగొనండి” అని అధికారులకు సూచించారు.
అధికారులు సొంత నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని, ప్రభుత్వ ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ లో సత్తా చాటిన మరిమడ్ల విద్యార్థి... జావలిన్ త్రోలో సిల్వర్, రాష్ట్రస్థాయికి సెలెక్ట్
Posted On 2026-08-20 17:43:07
Readmore >
ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు కఠినం : పోలీస్ కమిషనర్ బి. సుమతి
Posted On 2026-08-20 17:09:57
Readmore >
22ఏ సమస్యపై ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం.. ప్రజలకు పూర్తి భరోసా
Posted On 2026-08-20 17:06:43
Readmore >
డ్రగ్స్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల:... అవగాహన కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే సెకండ్
Posted On 2026-08-20 09:09:01
Readmore >
విమర్శనాత్మక వార్తలపై జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు సరికాదు...
Posted On 2026-08-20 04:28:21
Readmore >
₹4 లక్షల నకిలీ ఆభరణాలతో ముత్తుట్ లో లోన్... ఖమ్మం లో ముఠా అరెస్ట్
Posted On 2026-08-19 16:17:15
Readmore >