| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

దర్యాప్తులో నిందితుల గుర్తింపు – చాకచక్యంగా పట్టివేత

36 గ్రాముల బంగారు ముక్కుపోగులు, ద్విచక్ర వాహనం స్వాధీనం

సమయస్ఫూర్తితో నిందితులను పట్టుకున్న సదాశివనగర్ పోలీసులు

వివరాలు వెల్లడించిన సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారావుపేట్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగులు చోరీకి గురైన ఘటనపై ఆలయ నిర్వాహకులు సదాశివనగర్ పోలీసులకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. పిటిషన్‌ను స్వీకరించిన పోలీసులు క్రైమ్ నం.157/2026 U/s 331(4), 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.

దర్యాప్తులో భాగంగా పోలీసులు సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి, నిందితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. దర్యాప్తులో తోగరి శ్రీనివాస్, వయస్సు 47 సంవత్సరాలు, సదాశివనగర్ మరియు తోగరి మల్లేశ్వరి, వయస్సు 41 సంవత్సరాలు, ధర్మారావుపేట్లను నిందితులుగా గుర్తించారు. తేదీ 08-08-2026న ఇద్దరూ ధర్మారావుపేట్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్లి, ఆలయానికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. అనంతరం ఆలయం పక్కన ఉన్న రాయితో ఇనుప గేటు తాళాన్ని పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించి, అమ్మవారి విగ్రహాలకు అలంకరించి ఉన్న బంగారు ముక్కుపోగులను చోరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

చోరీ చేసిన బంగారు వస్తువులను వెంటనే విక్రయించకుండా ఇంట్లోని బీరువాలో దాచిపెట్టారు. అనంతరం 14-08-2026న ఇద్దరూ చోరీ చేసిన బంగారు ముక్కుపోగులను కామారెడ్డిలో విక్రయించేందుకు హీరో సీడీ డీలక్స్ మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. సుమారు 14:15 గంటలకు మర్కల్ X రోడ్డు, NH-44 వద్ద పోలీసుల వాహన తనిఖీలను గమనించిన నిందితులు పట్టుబడతామనే భయంతో మోటార్‌సైకిల్‌ను వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించగా, వారి వద్ద నుంచి ఎల్లమ్మ ఆలయం నుంచి చోరీకి గురైన మొత్తం 36 గ్రాముల బంగారు ముక్కుపోగులు మరియు నేరానికి ఉపయోగించిన హీరో సీడీ డీలక్స్ మోటార్‌సైకిల్ను పంచుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల వివరాలు

1. తోగరి శ్రీనివాస్, వయస్సు 47 సంవత్సరాలు, సదాశివనగర్.

2. తోగరి మల్లేశ్వరి, వయస్సు 41 సంవత్సరాలు, ధర్మారావుపేట్.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

ఎల్లమ్మ ఆలయం నుంచి చోరీకి గురైన 36 గ్రాముల బంగారు ముక్కుపోగులు

నేరానికి ఉపయోగించిన హీరో సీడీ డీలక్స్ మోటార్‌సైకిల్

ఈ కేసును ఛేదించడంలో సదాశివనగర్ ఎస్సై ఎం. పుష్పరాజ్తో పాటు క్రైమ్ పార్టీ సిబ్బంది అజర్ ఫారూక్, PC నరేష్, PC ఇసాక్ మరియు ARPC ప్రభు సమయస్ఫూర్తి, సమన్వయం మరియు అంకితభావంతో విధులు నిర్వహించారు. నిందితులను గుర్తించి, చాకచక్యంగా వెంబడించి పట్టుకోవడంతో పాటు చోరీకి గురైన బంగారు వస్తువులు మరియు నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంలో వారు కీలకంగా వ్యవహరించారు.

కేసును సమర్థవంతంగా ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న సదాశివనగర్ ఎస్సై, క్రైమ్ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అభినందించారు.

Previous ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Next కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
ADVERTISEMENT