డైలీ భారత్, కామారెడ్డి: సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ రైల్లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్‌ను ఎక్సైజ్, రైల్వే, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఉమ్మడిగా అడ్డుకున్నారు.
కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 6 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, కామారెడ్డి జిల్లా మధ్య నిషేధ అధికారి ముకుంద రెడ్డి ఆదేశాలతో ఈ దాడులు జరిగాయి.
ఈ తనిఖీల్లో కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, డిటిఎఫ్ సీఐ సుందర్ సింగ్, ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాసరావు, శరత్ కుమార్, అనిల్, మధు తో పాటు జాఫర్ షరీఫ్, అమృత రెడ్డి, శంకర్, పవన్, నర్సింలు, రమేష్, రాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు.
రైళ్ల ద్వారా మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా మరింత పెంచామని, ప్రయాణికులు అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.