డైలీ భారత్, తిరుపతి జిల్లా: తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి గ్రామం సమీపంలోని ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 8 మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన షేక్ బాజీబాబా నడుపుతున్న ప్లైవుడ్ లోడుతో కూడిన లారీ బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి సమీపంలోని చింపేడు గ్రామంలోని కట్టెల ఫ్యాక్టరీకి వెళ్తోంది. ఇదే సమయంలో యాదమరి మండలం పెరుమల్లపల్లి గ్రామం నుంచి తిరుపతిలో బంధువుల వివాహానికి వెళ్తున్న ఆటో గాదంకి ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకుంది.
మధ్యాహ్నం 12.55 గంటల ప్రాంతంలో ముందుగా వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఎలాంటి హెచ్చరిక సూచనలు ఇవ్వకుండా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ఆటో లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తవణంపల్లి మండలం ఏనుగుంటపల్లికి చెందిన యనమల మాధవి (40), ఆమె కుమార్తె మేఘన (15) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యాదమరి మండలం పెరుమల్లపల్లికి చెందిన పులకింటి రాజశేఖర్ (25)ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రమాదంలో పులకింటి నవీన్ (14), కొమ్ము విష్ణు (19), యనమల సూరి (17), పులకింటి బేబి (50), పులకింటి చిన్నబ్బ (50), పులకింటి రఘు (55), చాముండేశ్వరి (30), ఆటో డ్రైవర్ పులకింటి సుబ్రమణ్యం (50) గాయపడ్డారు. వీరికి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఎలాంటి ఇండికేటర్లు ఇవ్వకుండా వాహనాన్ని నిలిపివేయడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. లారీ డ్రైవర్‌పై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పాకాల పోలీసులు తెలిపారు.