| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కలకలం రేపుతున్న మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి

కలకలం రేపుతున్న మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేగిపింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, బీబీపేట మహిళా కానిస్టేబుల్‌ శ్రుతి అదృశ్యం కావడం.. అయితే శ్రుతి, మరో వ్యక్తి మృతదేహాలు అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్ద లభించగా.. అక్కడే ఎస్సై సాయికుమార్‌ కారు కూడా కనిపించినప్పటికీ, అతని ఆచూకీ లేకుండా పోయింది. ఈ పరిణామాలతో అసలు ఏం జరిగిందనేదానిపై చర్చ జరుగుతుంది. ఈ ఘటనపై రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తుండగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ సెల్‌ఫోన్‌ బుధవారం మధ్యాహ్నం నుంచి స్విచాఫ్ వస్తుంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు.

మరోవైపు బీబీపేట పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె పనిచేస్తున్న బీబీపేట పోలీసులను సంప్రదించారు. అయితే ఆమె పని ముగించుకుని వెళ్లిపోయిందని వారు సమాచారం ఇచ్చారు. దీంతో శృతి తల్లిదండ్రులు ఆందోళన చెంది అధికారులను సంప్రదించారు. దీంతో పోలీసులు ఆమె ఫోన్‌ సిగ్నల్‌ ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

ఈ క్రమంలోనే బుధవారం అర్దరాత్రి సమయంలో సదాశివనగర్‌ మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్ద శృతి, మరో వ్యక్తి సెల్ ఫోన్‌లు లభించాయి. అయితే అక్కడే భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌కు చెందిన కారు, చెప్పులు కూడా ఉన్నాయి. అనుమానంతో చీకట్లోనే చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా.. శృతితో పాటు మరో వ్యక్తి మృతదేహాలు లభించాయి. మరో వ్యక్తిని బీబీపేట పీఏసీఎస్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్‌గా గుర్తించారు. ఎస్సై సాయికుమార్‌ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఆయన ఏమయ్యారనేది అంతుచిక్కడం లేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సింధూ శర్మ హుటాహుటిన అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు.

అయితే గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆమెకు అప్పటికే వివాహం కాగా, విడాకులు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మెదక్‌ జిల్లాకు చెందిన సాయికుమార్‌ గతంలో బీబీపేట ఎస్సైగా పని చేసి, బదిలీపై భిక్కనూరుకు వచ్చారు. బీబీపేటలో పని చేసిన సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శృతి, సాయి‌కుమార్‌లు ఒకేసారి కనిపించకుండా పోవడం.. శృతి మృతదేహం లభ్యమైన చోటుకు సమీపంలోనే సాయికుమార్ కారు ఉండటం, అక్కడే నిఖిల్ మృతదేహం కూడా ఉండడం, ఎస్సై ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది

కామారెడ్డిలో మిస్టరీ డెత్స్‌పై ఎస్పీ సింధు శర్మ  స్పందించారు. ఎస్సై మొబైల్ ఫొన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్ అలాగే టైప్ రైటర్ ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందని, పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమన్నారు.

Previous తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా జక్కిడి శివ చరణ్‌ రెడ్డి
Next రుచి బావర్చి రెస్టారెంట్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
ADVERTISEMENT