డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణాన్ని కాదని బైపాస్ మీదుగా బస్సులు నడుపుతున్నారు.. దీనివల్ల ఇక్కడ ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు.. మరోవైపు ప్రయాణికులు లేక మీరు ఖాళీ బస్సులతో తిరుగుతున్నారు.. ఇది అవసరమా.. బస్సులను బైపాస్ మీదుగా కాకుండా షాద్ నగర్ మీదుగా నడపండి.. అంటూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆర్టీసీ ఆర్ఎం సంతోష్ కుమార్ ను కోరారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ ఆర్ఎం, సిబ్బందితో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. బస్టాండ్ లో ఎలాంటి సదుపాయాలు అవసరమైన తాను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మాత్రం ఇతర డిపోల బస్సులను బైపాస్ మీదుగా కాకుండా షాద్ నగర్ మీదుగా నడపండి.. అంటూ సూచించారు. రోజురోజుకు విస్తరిస్తున్న పట్టణ పరిధిలో హైదరాబాదులో ఉద్యోగాలు చేసుకునే యువత సంఖ్య పెరిగిందని, అదేవిధంగా వివిధ పనుల నిమిత్తం పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ప్రయాణికులు హైదరాబాదు వెళుతుంటారని, హైదరాబాద్ నుంచి రాత్రి వేళల్లో ఇక్కడికి వస్తుంటారని ఆయన గుర్తు చేశారు. వారికి సరైన బస్సు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బైపాస్ అనే పేరు ఉన్నప్పటికీ చాలామంది ఇక్కడ బస్సులు ఆపకుండా నేరుగా జడ్చర్ల వైపు వెళుతున్నట్లు తమకు ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వమే భరిస్తూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసింది కాబట్టి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా ప్రధాన దారులలో బస్సులను కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఆర్ ఎం స్పందిస్తూ వీలైనన్ని ఎక్కువ బస్సులను షాద్ నగర్ బస్టాండ్ మీదుగా నడిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం,కృష్ణారెడ్డి, అగునూరు బస్వం, చెంది తిరుపతిరెడ్డి, ముబారక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు..
News
షాద్ నగర్ నుంచి బస్సులు నడపండి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్