| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మందకృష్ణ మాదిగ భావోద్వేగంతో కంటతడి, గుండెకు హత్తుకొని ఓదార్చిన మోదీ.

మందకృష్ణ మాదిగ  భావోద్వేగంతో కంటతడి, గుండెకు హత్తుకొని ఓదార్చిన మోదీ.

డైలీ భరత్, హైదరాబాద్: భారాస, కాంగ్రెస్ పార్టీలు.. మాదిగ విరోధులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. "ఎంతో ప్రేమతో నన్ను ఈ సభకు ఆహ్వానించారు. మందకృష్ణ నా చిన్న తమ్ముడు. ఇంత ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలు.

అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సామాజిక న్యాయానికి మేం కట్టుబడి ఉన్నాం. స్వాతంత్య్రం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారు. ఆ ప్రభుత్వాలకు, మా ప్రభుత్వానికి తేడా గమనించాలి. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. అనేది మా విధానం. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. పేదరిక నిర్మూలనే మా ప్రథమ ప్రాధాన్యం. న్యాయం చేస్తామని అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి. మీరంతా వన్ లైఫ్. వన్ మిషన్ లా పోరాటం చేస్తున్నారు. మీ బాధలు పంచుకునేందుకే నేను ఇక్కడకు వచ్చా.


*భారాస ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తోంది..* 


తెలంగాణలో భారాస ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తోంది. దళిత నేతను సీఎం చేస్తామని భారాస నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. ప్రస్తుతం తెలంగాణ సంకట స్థితిలో ఉంది. తెలంగాణ అస్థిత్వాన్ని భారాస కాపాడలేకపోయింది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. దళితబంధు అన్నారు.. ఇవ్వలేదు. దళిత బంధు పథకం వల్ల భారాస నేతలకే మేలు జరిగింది. దళితుల ఆశలపై నీళ్లు చల్లింది కేసీఆరే. తెలంగాణలో భారాస, కాంగ్రెస్ ఒకరికొకరు పోటీపడుతున్నట్టు నటిస్తున్నారు. ఆ రెండూ అవినీతి పార్టీలే. దిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో కలిసి అవినీతి చేస్తున్నారు. అవకాశవాద రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ను ఎన్నికల్లో రెండు సార్లు ఓడించింది. కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ సెంట్రల్ హాలులో అంబేడ్కర్ చిత్రపటం కూడా పెట్టలేదు. అంబేడ్కర్ ను భారతరత్న కూడా ఇవ్వలేదు. మేం వచ్చాక అంబేడ్కర్ ఫొటో పెట్టాం.. భారతరత్న ఇచ్చాం. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేస్తుంటే కాంగ్రెస్ వ్యతిరేకించింది. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత భాజపాదే. దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. దళిత వ్యక్తి రాష్ట్రపతి కావడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు" అని మోదీ విమర్శించారు.

Previous గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి
Next దీపావళి లక్ష్మీ పూజా విధానం, వ్రత నియమాలు.
ADVERTISEMENT