డైలీ భారత్, (స్పెషల్ స్టోరీ): ఓట్లు పండుగ వచ్చిందంటే చాలు మేధావి వర్గం ప్రజలకు ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు నాణ్యమైన విద్య, వైద్యం ఇస్తే చాలు అనే చర్చ చేస్తది.పాపం వారి మాటలు రాజకీయ పార్టీలకు రుచించవనుకోండి.రాజకీయ పార్టీలు మాత్రం విద్య,వైద్యం తప్ప అన్ని ఫ్రీగా ఇస్తాం అన్నట్లుగా మాట్లాడతాయి.జాతీయ విద్యా విధానం ప్రతిపాదించి,పార్లమెంట్ లో ఆమోదించి,60 ఏండ్లు గడిచినా, అనేక మంది పాలకులు మారిన దేశంలో నేటికి కామన్ స్కూల్ (కామన్ స్కూల్ ఎడ్యుకేషన్) అమలు నోచుకోని హామీగా,కలగానే మిగిలింది.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం కేజీ టు పీజీ అమలుకు నోసుకోలేదు.కేవలం గురుకులాలను ప్రోత్సహిస్తూ మిగతా బడులను నిర్లక్ష్యం చేసింది.కలెక్టర్ పిల్లవాడైన కడుపేద పిల్లవాడైన ఒకే బడిలో చదివేలా విద్యావిధానాన్ని రూపొందించి అమలు చేస్తామని నాడు హామీ ఇచ్చారు. విద్యారంగంలో ఉన్న వివిధ యాజమాన్యాలను ఒకే యాజమాన్యానికి కిందికి తీసుకవచ్చి కామన్ స్కూల్ సిస్టం గా ఏర్పాటు చేస్తామని (కేజీ టు పీజీ) చెప్పింది.ఒకే యాజమాన్యం ఓకే సిలబస్,అమీర్ నుండి గరిబ్ అందరూ చదువుకునే చదివే కామన్ స్కూల్ ఎడ్యుకేషన్.నేటి ప్రభుత్వం మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని,వాటిలో మంచి వసతులు కల్పించి, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన విద్యను ఉచితంగా అందిస్తామని అంటుంది.
విద్యారంగంలో కామన్ స్కూల్ ఆశయాన్ని మొట్టమొదటిసారిగా 1964-66 లో ప్రస్తావించింది కొఠారి కమిషన్. దేశంలోని పాఠశాల విద్యారంగాన్ని, ఉన్నత విద్యారంగాన్ని పరిశీలించి తగిన సిఫారసులు చేయడం కొరకు నాటి యుజిసి చైర్మన్ డి ఎస్ కొఠారి అధ్యక్షతన కమీషన్ ఏర్పాటు చేసింది నాటి కేంద్ర ప్రభుత్వం.కొఠారి కమిషన్ ఏర్పడే నాటికి దేశవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల కింద వివిధ రకాలుగా పాఠశాలలు నడపబడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు,స్థానిక సంస్థలు నడుపుతున్న పాఠశాలలు, ప్రైవేటు,ఏడేడ్ పాఠశాలలు స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న పాఠశాలలు, కొన్ని గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ విద్యారంగ విస్తరణ కొరకు పాఠశాల సంఖ్యను పెంచడం కంటే కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఆవేశ ప్రాంత పాఠశాల విధానం మీద ఆధారపడి ఈ కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండాలని కొఠారి కమిషన్ చెప్పింది.1968లో మొదటి జాతీయ విద్యా విధానంలో,1986లో రెండవ విధానంలో మరియు 1992లో సవరించిన సంస్కరణలో ఈ కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ పొందుపరచబడింది.1986 మరియు 1992 విధాన ప్రకటనలను పార్లమెంటు కూడా ఆమోదించింది.ప్రపంచంలో అభివృద్ధి చెందిన,అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏదో ఒక రూపంలో కామన్ స్కూల్ విధానం అమలులో ఉంది.
సమాజంలో ధనవంతులకు,పేదవారికి మధ్య చదువుకున్నవారికి చదువు రాని వారికి మధ్య వివిధ మతాల, కులాల మధ్య ఉన్న దూరం విద్యారంగాన్ని ప్రభావితం చేసిందని ఈ విభేదాలు అంతరాల్లో చిక్కుకొని ప్రజలు విభజింపబడి ఉన్నారని సామాజిక విభజన ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలను సమాజానికి దూరంగా ఉంచిందని కొఠారి కమిషన్ గ్రహించి,ప్రత్యామ్నాయంగా కామన్ స్కూల్ విధానాన్ని చూపింది. సామాజిక విభజనకు సంబంధించిన ప్రభావాలు పాఠశాల మీద పడకూడదని, పాఠశాల స్థానిక సమాజంతో సన్నిహితంగా కలిసిపోవాలని, సామాజిక భాగస్వామ్యం పెరిగి జాతీయ అభివృద్ధికి ముఖ్యంగా సామాజిక సమగ్రతకు, జాతీయ సమగ్రతకు దోహదపడాలని కొఠారి కమిషన్ భావించింది.కామన్ స్కూల్ విధానంలో ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక సంస్థల పాఠశాలకు మాత్రమే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు కూడా కొఠారి కమిషన్ చోటు కల్పించింది. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మాదిరిగానే పనిచేస్తూ సేవా దృక్పథం కలిగి ఉండాలని భావించింది. ఆవాస ప్రాంత పాఠశాల విధానంలో ఒక పాఠశాలకు దాని ఆవాస ప్రాంతాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరూ కుల,మత, జాతి తో సంబంధం లేకుండా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా సామాజిక హోదాతో సంబంధం లేకుండా ఆవాస ప్రాంతంలో ఉన్న పాఠశాలలకు మాత్రమే వెళ్లాలి.
సమాజంలోని ఉన్నత వర్గాల చెందిన వారు కూడా ఆవాస ప్రాంతం పాఠశాలకు రావడం వలన వారికి సాధారణ విద్యార్థులతో జీవిత అనుభవాలను పంచుకునే అవకాశం కలుగుతుందని, కుల మత తత్వాలకు అతీతంగా ప్రజల్లో లౌకిక తత్వం పెరుగుతుందని భావించింది.ఆర్థికంగా సామాజికంగా పలుకుబడి కలిగిన వర్గాలకు చెందినవారు ఆవాస ప్రాంత పాఠశాలలకు రావడం వలన పలుకుబడి గల వర్గాలు కామన్ స్కూల్ మీద ఆవాస ప్రాంత పాఠశాలల మీద మొత్తంగా ప్రభుత్వ విద్యా రంగం మీద ఆసక్తి కలిగి ఉంటాయని కమిషన్ అభిప్రాయపడింది.
కామన్ స్కూల్ విధానం విద్యారంగంలో ఒక విప్లవం వంటిదని సమాజంలో జరగవలసిన సామాజిక ఆర్థిక సంస్కృతిక విప్లవాలకి అది బాట వేస్తుందని కొఠారి కమిషన్ భావించింది.ఈ కామన్ స్కూల్ లక్ష్య సాధన కోసం ప్రభుత్వాలకి కాలవ్యవధిని నిర్ణయించింది. దీర్ఘకాలికంగా 20 సంవత్సరాల కాలంలో కామన్ స్కూల్ లు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని భావించింది. ఆ గడువు 1986 తో ముగిసిపోయింది.ఇప్పటికీ పాలకులు పట్టించుకున్న దాకలాలు లేవు.కుల మతాల పేరుతో గురుకులాలను ఏర్పరచి పసిప్రాయంలోనే కులమత బీజాలను బాలలలో నాటుతున్నారు.
విద్య వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ 1980 దశకం లో ప్రారంభమైంది.1990లో విద్యా వ్యాపారం బాగా విస్తరించింది. నేడు విద్యారంగం ప్రైవేటు కార్పోరేటివ్ శక్తుల కదంబ హస్తాల్లో బంధీ అయి విలవిల లాడుతుంది. దేశంలోని ప్రజలకు కామన్ స్కూల్ కలగానే మిగిలిపోయింది.
నూతన జాతీయ విద్యా విధానం (NEP- 2020) ప్రకారం విద్య లో పెట్టిన పెట్టుబడులు మానవ వనరులు తయారు చేస్తాయని, అవి ప్రపంచ మార్కెట్ లను అభివృద్ధి పరుస్తాయని, నైపుణ్యవంతమైన ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేసే విధంగా రూపొందించబడింది. కామన్ స్కూల్ ఏర్పాటు దిశగా చర్యలు లేవు.
భారతదేశపు భవిష్యత్తు తరగతి గదిలో రూపొందుతుందని కొఠారి కమిషన్ ఆశించింది.
ఆ తరగతి గది కులమతాలకతీతంగా, సామాజిక ఆసమానతలకతీతంగా రూపొంది జాతీయ సమగ్రతకు తోడ్పడుతుందని, లౌకికత్వాన్ని కలిగి ఉంటుందని కొఠారి కమిషన్ ఆశించింది. కమిషన్ ఏర్పడి 60 ఏళ్లు గడిచిన కమిషన్ ఆశయ సాధనకు నాటి నుండి నేటి వరకు చిత్తశుద్ధితో కృషి చేసిన పాలకులు లేరు స్వతంత్ర భారతంలో విద్యా కమిషన్లు ఏర్పాటు చేయడం కమిషన్ల ప్రతిపాదనలను పక్కన పెట్టడం జరుగుతూనే ఉంది. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కామన్ స్కూల్ ఆశయాన్ని అమలు చేసే దిశగా, భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యసాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
మొన్నటివరకు కేజీ టూ పీజీ,నేడు ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ పాలకులు మాట్లాడుతున్నారు. ఏండ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, ప్రీ ప్రైమరీలను ప్రారంభించి, ఉన్నత పాఠశాలలను మినీ గురుకులాలుగా మార్చి, ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకొని, కుల,మత, సామాజిక ఆర్థిక అసమానతులకు అతీతంగా అందరికీ నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటే కామన్ స్కూల్ కల కొంతవరకైనా నిజమయ్యే అవకాశం ఉంటుంది.
పాకాల శంకర్ గౌడ్
విద్యావేత్త
9848377734.