ప్రభుత్వ విప్ "ఆది "ని కోరిన స్మారక కమిటీ
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కొనరావు పేట్ మండలం మల్కాపేట్ బ్యాలెన్స్ రిజర్వాయర్ కు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నేరెళ్ల మాజీ శాసనసభ్యులు కర్రోల్ల నర్సయ్య పేరు పెట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసును కలిసిన కర్రోల్ల నర్సయ్య స్మారక కమిటీ వినతి పత్రం అందజేసింది. శుక్రవారం కర్రోల్ల నర్సయ్య స్మారక కమిటీ నిర్వాహకులు కర్రోల్ల భాస్కర్, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేశారు. మల్కాపేట్ బ్యాలెన్స్ రిజర్వాయర్ కు కర్రోల్ల నర్సయ్య పేరు పెట్టడంతో పాటు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట క్రాసింగ్ వద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆది శ్రీనివాస్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. నిస్వార్ధంగా ప్రజల కోసం పనిచేసిన కర్రోల్ల నర్సయ్య జీవితం గురించి భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందని గుంటి వేణు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కు వివరించారు. కార్యక్రమంలో బొమ్మెన భాస్కర్ రావు, నాయిని ప్రభాకర్ రెడ్డి, బోయిని దేవరాజ్, పాకాల కార్తీక్, రవీందర్ తదితరులు ఉన్నారు.