డైలీ భారత్ డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రూపుదిద్దుకోనుందని నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ వెల్లడించారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్‌లో డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ఏఐ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేకంగా రిసెప్షన్ వద్ద సేతు కియోస్క్ ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు 10 భాషల్లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకునే సదుపాయం కల్పించనున్నారు.
అంతేకాకుండా ఏఐ సాంకేతికత ద్వారా ఎఫ్‌ఐఆర్ నమోదు, కేసు డైరీ తయారీ, దర్యాప్తు నివేదికలు, ఛార్జ్‌షీట్ల రూపకల్పన వంటి ప్రక్రియలను నిర్వహించనున్నారు. ఈ సరికొత్త విధానంపై పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు సజ్జనర్ తెలిపారు.
ఏఐ సాంకేతికత వినియోగంతో పోలీస్ సేవలు మరింత వేగవంతం కావడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయని భావిస్తున్నారు.