డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని దారి మళ్లించిన కేసులో కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఆళ్ళ మురళిని వెంటనే అరెస్టు చేయాలని, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు.
యెర్రా కామేష్ మాట్లాడుతూ - కొత్తగూడెం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నెం. 202/2026 లో ఆళ్ళ మురళి నిందితుడని, పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఆయన భాగస్వామిగా ఉన్న రైస్ మిల్లుకు అప్పగించిందని, నిబంధనల ప్రకారం బియ్యం తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా గత రెండేళ్ల ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన రూ.6.91 కోట్ల విలువైన ధాన్యాన్ని దారి మళ్లించారని ఆరోపించారు.
2021, 2022లోనూ ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయని, 3 నెలల క్రితం రూ.2 కోట్లు చెల్లించారని తెలిపారు. అయినా అరెస్టు చేయకపోవడంపై ప్రశ్నించారు.
ప్రతి 15 రోజులకు రెవెన్యూ అధికారులు మిల్లులను తనిఖీ చేయాల్సి ఉండగా రెండేళ్లుగా గుర్తించలేదని, అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టర్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ సొమ్ము కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాలోత్ వీరు నాయక్, శంకర్, రాంబాబు, కవిత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.