శంకరపట్నంలో ఏసీబీ దాడి: రూ. 20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన జీపీఓ..
పట్టాదారు పాస్ పుస్తకం కోసం లంచం డిమాండ్: శంకరపట్నం తహసీల్దార్ కార్యాలయంలో జీపీఓ శ్రీనివాస్ అరెస్ట్..
డైలీ భారత్, శంకరపట్నం:కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మోలంగూర్ గ్రామానికి చెందిన గ్రామ పాలనాధికారి జీపీఓ కంపేటి శ్రీనివాస్ రూ.20,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారునికి సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ కోసం సిద్ధం చేసిన ఫీల్డ్ సర్వే నివేదికను సమర్పించి, పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేయించేందుకు జీపీఓ లంచం డిమాండ్ చేశారు. మొదట రూ.15,000 డిమాండ్ చేసిన శ్రీనివాస్, గురువారం అదనంగా మరో రూ.5,000 పెంచి మొత్తం రూ.20,000 ఇవ్వాలని కోరారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం సాయంత్రం శంకరపట్నం తహసీల్దార్ కార్యాలయంలో రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రంగుచేతులతో పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, రసాయన పరీక్షలు నిర్వహించగా నేరం రుజువైనట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అనంతరం జీపీఓను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా సమాచారం అందించాలని అధికారులు కోరారు.