డైలీ భారత్, మేడ్చల్-మల్కాజిగిరి, కీసర: పోలీసుల పేరు చెప్పి అమాయకులను బురిడీ కొట్టించిన భార్యాభర్తలు చివరికి పోలీసులకు చిక్కారు. తాము ఇంటెలిజెన్స్ డీఐజీలమని చెప్పుకుంటూ నకిలీ గుర్తింపు కార్డులతో, మార్ఫింగ్ ఫొటోలతో లక్షల్లో మోసం చేసిన శ్రీధర్, నందిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎలా మోసం చేశారంటే...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు తాము పోలీసు శాఖలో ఉన్నతాధికారులమని నమ్మించేవారు. ఇందుకోసం నకిలీ పోలీసు ఐడీ కార్డులను ఉపయోగించడంతో పాటు, ప్రముఖ వ్యక్తులతో కలిసి దిగినట్లుగా కనిపించే మార్ఫింగ్ ఫొటోలను బాధితులకు చూపించేవారు.
"మాకు పైస్థాయి అధికారులతో పరిచయాలు ఉన్నాయి. మీ సమస్యను మేము సెటిల్ చేస్తాం" అని చెప్పి భయపెట్టి, బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారు.
ఎలా బయటపడింది?
కొంతకాలంగా సాగుతున్న ఈ మోసంపై నిందితుల మాటలు, ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితులు కీసర పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులు నకిలీ పోలీసులుగా చలామణి అవుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు నిందితుల వద్ద నుంచి నకిలీ గుర్తింపు కార్డులు, మార్ఫింగ్ ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. వీరి చేతిలో ఇంకా ఎంతమంది మోసపోయారనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు.
పోలీసుల హెచ్చరిక
పోలీసుల పేరుతో ఎవరైనా ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 100కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు. పోలీసు శాఖ ఎప్పుడూ ఫోన్ ద్వారా డబ్బు అడగదని గుర్తుంచుకోవాలని కోరారు.