కాలువలో పడేసిన వైనం!
డైలీ భారత్, ఖమ్మం క్రైమ్:ఖమ్మం నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేవలం ఇంటి ముందు మూత్ర విసర్జన చేశాడనే చిన్న వివాదం ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకుల గుట్ట సమీపంలో ఒక యువకుడు కత్తిపోట్లకు గురై దారుణంగా హత్యకు గురయ్యాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన శ్రీనాథ్ (24) అనే యువకుడు ఫంక్షన్ డెకరేషన్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మధు అనే యువకుడు వడ్డెర కూలిగా జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరూ అవివాహితులు.
అసలేం జరిగిందంటే?
గురువారం అర్ధరాత్రి సమయంలో మధు తన ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తుండగా, అప్పటికే తీవ్రంగా మద్యం మత్తులో ఉన్న శ్రీనాథ్ అక్కడికి వచ్చాడు. "నా ఇంటి ముందే ఎందుకు మూత్రం పోస్తున్నావు?" అంటూ మధుతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన శ్రీనాథ్.. సమీపంలో ఉన్న ఒక సెంట్రింగ్ కర్రను తీసుకుని మధు తలపై బలంగా మోదాడు.
కత్తితో విచక్షణారహితంగా దాడి..
శ్రీనాథ్ కొట్టిన దెబ్బకు కోపంతో ఊగిపోయిన మధు.. వెంటనే తన ఇంట్లోకి వెళ్లి పదునైన కత్తిని తీసుకుని బయటకు వచ్చాడు. శ్రీనాథ్‌పై విచక్షణారహితంగా దాడి చేస్తూ కత్తితో పొడిచి పొడిచి నరికేశాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన శ్రీనాథ్‌ను సమీపంలోని ఒక కాలువలో పడేసి నిందితుడు మధు అక్కడి నుండి పరారయ్యాడు.
ఆసుపత్రికి తరలించే లోపే మృతి
శుక్రవారం ఉదయం రంగనాయకుల గుట్ట సమీపంలోని కాలువలో విగతజీవిగా పడి ఉన్న శ్రీనాథ్‌ను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం శ్రీనాథ్‌ను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
పోలీసుల గాలింపు చర్యలు:
సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్ పరిశీలించింది. చిన్న గొడవ చివరకు హత్యకు దారితీయడంతో స్థానిక ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు మధు కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.