| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

డైలీ భారత్, వేములవాడ: స్టోన్ క్రషర్, రైస్ మిల్ నిర్వాహకులను బెదిరించి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే వివరాలు వెల్లడించారు.

ఘటన వివరాలు

నిందితులైన దండు వినోద్, పెద్దిగారి అమరగొండ అజయ్ కలిసి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.

పథకంలో భాగంగా వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారం గ్రామ శివారులో స్టోన్ క్రషర్ నిర్వహిస్తున్న నీలం గురవయ్యకు ఈ నెల 9న దండు వినోద్ ఫోన్ చేసి, క్రషర్ లైసెన్స్, భూమికి సంబంధించిన అసత్య ప్రచారం చేస్తామని బెదిరించారు. 

అనంతరం గురవయ్యను అగ్రహారం గుట్టల వద్దకు తీసుకెళ్లి, వ్యాపారానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేయకుండా ఉండాలంటే రూ.20,00,000/- ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే వ్యాపారాన్ని దెబ్బతీస్తామని బెదిరించారు. దీంతో భయపడిన బాధితుడు ATMకు వెళ్లి రూ.50,000 నగదు తీసుకుని వచ్చి వేములవాడలోని అగ్రహారం టీ పాయింట్ వద్ద నిందితులకు అందించారు.

అదే విధంగా వేములవాడకు చెందిన రైస్ మిల్లర్ బండ మల్లేశంను కూడా బెదిరించి రూ.10,00,000/- డిమాండ్ చేశారు.

పోలీసుల దర్యాప్తు

బాధితుల ఫిర్యాదు మేరకు వేములవాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిన్న రాత్రి సాయినగర్‌లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

వారి వద్ద నుండి రూ.50,000 నగదు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఈరోజు రిమాండ్‌కు తరలించారు.

నిందితుల వివరాలు:

దండు వినోద్ 33 సంవత్సరాలు, తండ్రి ఐలయ్య, నివాసం: ఏగలాస్పూర్ గ్రామం, కొనరావుపేట మండలం. ప్రస్తుతం: సాయి నగర్, వేములవాడ

పెద్దిగారి అమరగొండ అజయ్ 27 సంవత్సరాలు, తండ్రి నాగమల్లయ్య, నివాసం: నాంపల్లి, వేములవాడ

ఎస్పీ హెచ్చరిక... 

ఎవరైనా వ్యక్తులు బెదిరింపులకు పాల్పడి డబ్బులు డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని లేదా 112 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. 

వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఎలాంటి బెదిరింపులకు, ఒత్తిళ్లకు లొంగకుండా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలన్నారు. బెదిరింపులు, అసత్య ప్రచారాలు, అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Previous ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Next సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
ADVERTISEMENT