పాత పెన్షన్ విధానమే మేలు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక,ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కు రూపాంతరమే.
2004 కు పూర్వం నియామకం కాబడిన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం(OPS) ఉండేది. నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ,కార్పొరేటీ కరణ వల్ల పాలకులు ఉద్యోగుల సంక్షేమాన్ని పక్కనబెట్టి అమలులో ఉన్న పాత పెన్షన్ స్కీం కు బదులు కొత్త పెన్షన్ స్కీమ్(CPS) తీసుకువచ్చారు. ఈ ఓ పి ఎస్, సిపిఎస్ మరియు యుపిఎస్ వల్ల ఉద్యోగులకు ఎంత మేరకు మేలో జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఓల్డ్ పెన్షన్ పథకం కింద ఉద్యోగులకి సామాజిక ఆర్థిక భద్రత లభించేది.పాత పెన్షన్ పరిధిలోని ఉద్యోగికి రిటైర్మెంట్ సమయంలో 50% పెన్షన్ ,ఒకవేళ ఉద్యోగి మరణిస్తే కుటుంబ సభ్యులకి 30% ఫ్యామిలీ పెన్షన్,నిర్ణీత గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి అదనపు సౌకర్యాలు ఉండేవి.
2004లో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టింది.
1జనవరి 2004 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ ను వర్తింపజేస్తూ అప్పటి భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పింఛన్ పథకాన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్వయించుకొని వారి ఉద్యోగులకు అమలు చేయడం ప్రారంభించాయి.
సిపిఎస్ ఉద్యోగి తన బేసిక్ పే (మూలవేతనం) డిఎ (కరువు భత్యం) లో కలిపి 10% మ్యాచింగ్ గ్రాంట్ గా, ప్రభుత్వం నుంచి మరో 10,% సొమ్మును నేషనల్ పెన్షన్స్ స్కీం ట్రస్ట్ లో జమ చేస్తారు. ఉద్యోగికి కేటాయించబడిన పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్లో- ప్రాన్ ఈ మొత్తం సొమ్ము జమ అవుతుంది. ఉద్యోగి పదవీ విరమణ పొందే వరకి జమైన మొత్తం సొమ్ము నుండి 60% డబ్బును మాత్రమే ఉద్యోగికి నగదుగా చెల్లిస్తారు. మిగతా 40% డబ్బును భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు దానిపై వచ్చే లాభాన్ని నెలవారి పెన్షన్ కింద రిటైర్డ్ ఉద్యోగికి చెల్లిస్తారు.
నూతన పెన్షన్ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నప్పటి నుండి దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలని ప్రారంభించాయి ఈ ఉద్యమాల తీవ్రత గల్లీలో ప్రారంభమై ఢిల్లీ వరకు చేరింది. రెండు దశాబ్దాలుగా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలను పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఉద్యమాల్ని మరింత తీవ్రతరం చేశారు.
సిపిఎస్ ఉద్యోగి సొమ్మును ఎంతో ఒడిదుడుకులతో కూడిన స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం వల్ల ఉద్యోగి సొమ్ముకి ఆర్థిక భద్రత లోపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా వారి జీవితాంతం ప్రజలకు సేవ చేసి పదవీ విరమణ పొందిన అనంతరం ఉద్యోగుల కుటుంబాల కనీస అవసరాలకి సరిపోయే డబ్బులు పెన్షన్ రూపకంగా అందకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
సిపిఎస్ ఉద్యోగి, ఉద్యోగంలో ఉండగా మరణించిన సందర్భాలలో వారికి వచ్చే పెన్షన్లు ప్రభుత్వాలు ఇచ్చే ఆసరా పెన్షన్ల కన్నా తక్కువ ఉండడం వల్ల ఉద్యోగుల కుటుంబాలు సామాజిక ఆర్థిక భద్రత కరువై వీధుల్లో పడ్డాయి. ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకి సిపిఎస్ గుదిబండగా మారింది.
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు సిపిఎస్ రద్దు కోసము ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసుకొని పోరాటాలు చేయడం ప్రారంభించాయి. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(STFI) ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సిపిఎస్ రద్దు కోరుతూ పెద్ద ఎత్తున పోరాటం చేశారు.
సిపిఎస్ అమలను ప్రారంభించినప్పుడే వాటి ఫలితాలను అంచనా వేసిన వామపక్ష పార్టీలు, మేధావులు, ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పోరాటాలు చేయసాగాయి.
మెల్లమెల్లగా ఉద్యోగుల ఆకాంక్షలను గుర్తించిన కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో సిపిఎస్ రద్దు అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఎన్నికల్లో విజయం సాధించాక భారతదేశంలోని
రాజస్థాన్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాష్ట్రాల్లో బీజేపీ యేతర
రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించడం ప్రారంభించాయి. దీనివల్ల మిగతా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగడం, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగింది.ఉద్యోగుల అనేక పోరాటాల ఫలితంగా గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేయడం సాధ్యముకాదని, దాని స్థానంలో ఉద్యోగుల సంక్షేమం కోసం మేలైన పథకాన్ని తీసుకొస్తామని పార్లమెంట్లో ప్రకటించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘమైన సమీక్షల అనంతరం ఎన్పీఎస్ లో చేయాల్సిన మార్పులపై యుపిఎస్ ను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సోమనాథన్ కమిటీ సిఫారసు చేసింది. ఇటీవల కేంద్ర క్యాబినెట్ యూనిఫైడ్ పెన్షన్స్ స్కీం ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ యుపిఎస్ 1ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి రానుంది యుపిఎస్ లో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైన చేరితే అదనపు వారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.
యూనిఫైడ్ పెన్షన్ స్కీం(UPS)
ఉద్యోగి పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న మూలవేతన సగటులో 50% పెన్షన్ అందుతుంది. ఈ పెన్షన్ కు కనీస సర్వీసు 25 ఏళ్లు ఉండాలి. పెన్షన్ దారుడు మరణించాక వారి భాగస్వామికి 60% పెన్షన్ అందే అవకాశం ఉంది. ఉద్యోగికి అందించే కనీస పెన్షన్ 10000 కు అర్హత సాధించాలంటే కనీస సర్వీసు పది ఏండ్లు ఉండాలి. యుపిఎస్ లో ప్రభుత్వ వాట 14.5% నుంచి 18% పెరుగుతుంది.
పాత పింఛను పథకం తో పోల్చుకుంటే ఈ యు పి ఎస్ లో ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ అదనంగా ఉంది.సొమ్ము షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల భద్రత లేదు, పెన్షన్ పై పిఆర్సి అమలు లేకపోవడం భవిష్యత్ లో ఉద్యోగి వచ్చే పెన్షన్ లో పెరుగుదల ఉండదు.ఉద్యోగుల సొమ్ము స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి మ్యూచువల్ ఫండ్ ల ద్వారా కార్పొరేట్లకు లాభార్జన చేకూరేలా చేస్తూ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు నూతన ఒరవడిలో ఉద్యోగులు పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.ఓ పి ఎస్ ద్వారా మాత్రమే ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రత కలుగుతుంది. ఓ పి ఎస్ సాధించే వరకి పోరాటాలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పై ఉంది. ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాల అమలు చేస్తున్న పాలకులు,ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత కోసం ఓ పి ఎస్ అమలు చేయాలని గ్రహించాలి.
పాకాల శంకర్ గౌడ్.
సామాజిక విశ్లేషకులు.
9848377734.