డైలీ భారత్, బీబీపేట్ (కామారెడ్డి జిల్లా): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ భర్త కొరివి నరసింహులు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి.
ఈ సందర్భంగా గ్రామం అభివృద్ధి చెందాలని, దుర్గామాత ఆశీస్సులతో పాడిపంటలతో గ్రామం చల్లగా ఉండాలని, గ్రామంలోని ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు మాట్లాడుతూ, బీబీపేట్ మండలంలో తొమ్మిది గ్రామాల్లో దుర్గా భవాని నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. అమ్మవారు వెళ్లేటప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారులు చెరువుల వద్ద, కరెంటు స్తంభాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అమ్మవారి విగ్రహాన్ని తరలించే దారిలో కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లు తగిలే అవకాశం ఉంటే ముందుగానే అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరించాలని కోరారు.