డైలీ భారత్,కామారెడ్డి: 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన తన ప్లాట్ ను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళ బుధవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
బాధితురాలు ఆశా భాను తెలిపిన వివరాల ప్రకారం... 40 సంవత్సరాల క్రితం ముప్పారపు వెంకయ్య వద్ద సీనియర్ సిటిజన్ విద్యానగర్ కాలనీలో 290 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో 90 గజాలను గతంలో విక్రయించగా, మిగిలిన 200 గజాలను 2008లో రవికిరణ్, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపించారు.
ఆ సమయంలో ఫెన్సింగ్ పనులు చేపట్టడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిర్మాణాన్ని ఆపివేయించారని తెలిపారు. అనంతరం కోర్టును ఆశ్రయించగా 2018లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. కోర్టు తీర్పు ఆధారంగా మున్సిపాలిటీలో ఎల్.ఆర్.ఎస్. కట్టి ఇంటి నిర్మాణానికి అనుమతి కూడా తీసుకున్నామని చెప్పారు.
అయితే మూడు రోజుల క్రితం తమ స్థలంలోకి వచ్చిన రవికిరణ్, ప్రవీణ్ కుమార్ మళ్లీ ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించారని, అక్కడ తమ పేరిట బోర్డు పాతారని బాధితురాలు తెలిపింది. బోర్డు తొలగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై సంబంధిత పోలీస్ స్టేషన్ లో అన్ని డాక్యుమెంట్లు చూపించి ఫిర్యాదు చేసినా మూడు రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో బుధవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.