Posted on 2026-06-03 19:04:31
చిన్ననాటి భయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయా? ఎలాగో తెలుసుకోండి..
వ్యాస కర్త: ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్, సిరిసిల్ల, TPA రాష్ట్ర ఉపాధ్యక్షుడు
MSc Psychology, MSW Medical & Psychiatry, LLB
(తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక (14) వ్యాసం)
డైలీ భారత్, స్పెషల్: మనిషి జీవితంలో “భయం” అనేది సహజమైన భావోద్వేగం. ప్రమాదం నుంచి మనల్ని రక్షించడానికి భయం అవసరం కూడా. కానీ కొన్ని సందర్భాల్లో ఈ భయం అసహజ స్థాయికి చేరి వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తన, వ్యక్తిత్వం మరియు జీవనశైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాంటి తీవ్రమైన, నియంత్రించలేని భయాలను “ఫోబియాస్” (Phobias) అంటారు.
ఒక ప్రత్యేక పరిస్థితి, వస్తువు, ప్రదేశం, జంతువు లేదా సంఘటన పట్ల అధికమైన మరియు అర్థం లేని భయం కలగడం ఫోబియా. చీకటి, ఎత్తులు, జనసమూహాలు, పరీక్షలు, ఒంటరిగా ఉండటం, కుక్కలు, పాములు, కీటకాలు ఒక్కటేమిటి... ఊహించుకున్నోలకు ఊహించుకున్నన్ని భయాలు... ఎన్నో రకాలు...అనేక విషయాల పట్ల కొందరికి తీవ్రమైన భయాలు ఉంటాయి. సాధారణంగా కనిపించే ఈ భయాలు కొన్నిసార్లు వ్యక్తి జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేసే స్థాయికి చేరుతాయి. వ్యక్తిత్వంలో లోపాలకు దారి తీస్తాయి.
"ఫోబియాలు ఒక్కసారిగా వచ్చేవి కావు"
ఫోబియాలు చాలాసార్లు చిన్ననాటి అనుభవాలు, కుటుంబ వాతావరణం, భావోద్వేగ గాయాలు లేదా నేర్చుకున్న ప్రవర్తనల ద్వారా ఏర్పడతాయి. చిన్నప్పుడు జరిగిన భయానక సంఘటనలు పిల్లల మనసులో గాఢమైన ముద్ర వేస్తాయి. ఉదాహరణకు చిన్నప్పుడు కుక్క కరిచిన పిల్లవాడు తర్వాత అన్ని కుక్కల పట్ల భయపడవచ్చు. చీకట్లో ఒంటరిగా వదిలేయడం, పెద్దగా అరవడం, కఠినంగా శిక్షించడం వంటి అనుభవాలు కూడా భయాలకు కారణమవుతాయి.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను నియంత్రించడానికి “దెయ్యం వస్తుంది”, “బయటకు వెళ్తే తీసుకెళ్తారు” వంటి మాటలతో భయపెడతారు. ఈ మాటలు పిల్లల అవచేతనలో నిలిచిపోయి భయాలుగా మారవచ్చు. అలాగే పిల్లలు పెద్దలను గమనించి నేర్చుకుంటారు. ఇంట్లో పెద్దలు ఎప్పుడూ భయంతో స్పందిస్తే పిల్లలు కూడా అదే విధమైన భయాలను అలవర్చుకుంటారు. స్కూల్‌లో అవమానం, వేధింపులు, ప్రమాదాలు, కుటుంబ కలహాలు, హింసాత్మక వాతావరణం వంటి సంఘటనలు పిల్లల మానసిక భద్రతను దెబ్బతీసి భయాలకు దారితీస్తాయి.
పిల్లల భయాలను సరైన సమయంలో అర్థం చేసుకుని పరిష్కరించకపోతే అవి క్రమంగా వ్యక్తిత్వంలో భాగమైపోతాయి.
"నిర్లక్ష్యంతోనే భయాలు స్థిరపడుతాయి"
చిన్నప్పుడు క్లాస్‌లో మాట్లాడి నవ్వించబడిన పిల్లవాడు పెద్దయ్యాక స్టేజ్ ఫియర్‌కు గురవవచ్చు. పరీక్షలో ఒకసారి విఫలమైన విద్యార్థి ప్రతి పరీక్షను భయపడవచ్చు. చీకటి భయం ఉన్న పిల్లవాడు పెద్దయ్యాక కూడా ఒంటరిగా ఉండలేకపోవచ్చు.
భయాన్ని ఎదుర్కొనే బదులు వ్యక్తి ఆ పరిస్థితిని తప్పించుకోవడం ప్రారంభిస్తాడు. ఈ Avoidance Behaviour వల్ల భయం ఇంకా బలపడుతుంది జీవితంలో తిరపడుతుంది.
కొంతకాలానికి ఆ భయం వ్యక్తి జీవితాన్ని నియంత్రించే స్థాయికి చేరుతుంది.
ఫోబియాలు కేవలం తాత్కాలిక భయాలు కాదు. అవి వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని, సామాజిక సంబంధాలను ప్రభావితం చేస్తాయి. భయాలతో బాధపడే వ్యక్తులు చాలాసార్లు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. తమను తాము బలహీనులుగా భావించడం ప్రారంభిస్తారు. జనసమూహాల భయం, మాట్లాడే భయం ఉన్నవారు ఇతరులతో కలవడం తగ్గిస్తారు. భయం ఎక్కువైతే చిన్న విషయాల్లో కూడా గందరగోళానికి గురవుతారు. అవకాశాలు వచ్చినా ముందుకు రావడానికి వెనుకాడతారు.
భయం వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, చేతులు వణకడం, శ్వాస ఇబ్బంది, తల తిరగడం వంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలంగా భయాలతో జీవించడం వల్ల Anxiety, Stress, Depression వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఇలాంటి ఫోబియాలను సరైన కౌన్సెలింగ్, సైకాలజికల్ థెరపీల సహాయం ద్వారా అధిగమించవచ్చు.
"సైకాలజిస్టు పాత్ర అత్యంత కీలకమైనది"
ప్రతి భయం వెనుక ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు వ్యక్తికే ఆ కారణం తెలియకపోవచ్చు. చిన్ననాటి అనుభవాలు, అవమానాలు, ప్రమాదాలు, కుటుంబ వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన వంటి అంశాలను సైకాలజిస్టు విశ్లేషించి భయాల మూలాలను గుర్తిస్తాడు.
ఫోబియాలతో బాధపడేవారు చాలాసార్లు తమ భయాన్ని ఇతరులకు చెప్పలేక ఒంటరిగా బాధపడుతుంటారు. సైకాలజిస్టు విమర్శించకుండా, నిందించకుండా వ్యక్తి భావాలను ఓపికగా వింటాడు. దీనివల్ల వ్యక్తిలో భద్రత భావం పెరుగుతుంది.
భయాన్ని పెంచే ప్రతికూల ఆలోచనలను గుర్తించి వాటిని సానుకూల మరియు వాస్తవిక ఆలోచనలుగా మార్చడంలో Cognitive Behaviour Therapy (CBT) ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు “నేను స్టేజ్ మీద మాట్లాడితే అందరూ నవ్వుతారు” అనే ఆలోచనను “నేను ప్రయత్నించగలను, తప్పులు చేయడం సహజం” అనే ఆలోచనగా మార్చడంలో సహాయం చేస్తారు.
Exposure Therapy ద్వారా భయపడే పరిస్థితులను ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఎదుర్కొనేలా చేస్తారు. కుక్కల భయం ఉన్న వ్యక్తికి మొదట కుక్క ఫోటోలు చూపించడం, తర్వాత దూరం నుంచి చూడడం, ఆపై దగ్గరగా వెళ్లేలా ధైర్యం కల్పించడం జరుగుతుంది. ఈ విధానం ద్వారా మెదడులో ఉన్న “ప్రమాద భావన” తగ్గుతుంది.
అనేక రకాల ఫోభియాల నుండి వ్యక్తిని బయటకు తీసేందుకు సైకాలజిస్టులు వివిధ రకాల థెరపీలను, పద్ధతులను వినియోగిస్తారు.
ప్రతి థెరపీ వ్యక్తిలో నిగూఢమైన భయాల్ని తొలగించి సాధారణ జీవితం గడిపేందుకు తోడ్పడుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఫోబియాల సమయంలో కనిపించే శారీరక లక్షణాలను తగ్గించేందుకు Deep Breathing Exercises, Relaxation Techniques, Mindfulness, Meditation వంటి పద్ధతులను కూడా సైకాలజిస్టులు నేర్పిస్తారు. చిన్నపిల్లల్లో Play Therapy, Storytelling Techniques వంటి ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తారు.
తల్లిదండ్రులకు కూడా పిల్లల భయాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రోత్సహించాలి అనే విషయాల్లో సైకాలజిస్టులు అవగాహన కల్పిస్తారు. పిల్లలను భయపెట్టకూడదని, వారి భావాలను చిన్నచూపు చూడకూడదని, ప్రేమగా ధైర్యం చెప్పాలని సూచిస్తారు.
భయాలు తీవ్ర స్థాయికి చేరి వ్యక్తి దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు సైకియాట్రిస్ట్ సహాయం అవసరం అవుతుంది.
"అవసరమైతే సైకియాట్రిస్ట్ ను సంప్రదించాలి"
సైకియాట్రిస్ట్ వ్యక్తి మానసిక స్థితిని అంచనా వేసి Anxiety లేదా ఇతర మానసిక సమస్యలు ఉన్నాయా పరిశీలిస్తాడు. అవసరమైతే మందులు సూచించి తీవ్రమైన ఆందోళన, పానిక్ అటాక్స్ వంటి పరిస్థితులను నియంత్రించడంలో సహాయం చేస్తాడు. సైకాలజిస్టు మరియు సైకియాట్రిస్ట్ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
భయం సహజం… కానీ భయం మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి చేరితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
చిన్ననాటి భయాలు గుర్తించకుండా వదిలేస్తే అవి పెద్దయ్యాక వ్యక్తిత్వం, సంబంధాలు, విద్య, ఉద్యోగం మరియు మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు.
పిల్లల భయాలను అర్థం చేసుకోవడం, వారితో ప్రేమగా మాట్లాడటం, సరైన సమయంలో మానసిక సహాయం అందించడం చాలా అవసరం. సరైన అవగాహన, కుటుంబ మద్దతు మరియు సైకాలజికల్ సహాయంతో ఫోబియాలను అధిగమించి ధైర్యంగా జీవించడం పూర్తిగా సాధ్యమే.
Visit Us:
Sanjana Clinic
(Neuro Psychiatric & Counseling Center)
Shiva nager khaman, Main Road, Sircilla
వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదురుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి
Posted On 2026-06-03 20:01:51
Readmore >
జనసేన పార్టీలో తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు
Posted On 2026-06-03 20:00:43
Readmore >
భయాలు (Phobias)... చిన్ననాటి భయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయా?
Posted On 2026-06-03 19:04:31
Readmore >
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన కోర్టు కానిస్టేబుల్ భాస్కర్
Posted On 2026-06-03 18:14:16
Readmore >
కోనరావుపేట మండలంలో ప్లాస్టిక్ రహిత ధర్మారం లక్ష్యంగా ముందడుగు
Posted On 2026-06-03 16:16:28
Readmore >
కామారెడ్డి జిల్లా తెలంగాణ పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన మహోత్సవం
Posted On 2026-06-03 16:10:41
Readmore >
భూ తగాదాల్లో సెటిల్‌మెంట్లు చేసేవారికి “కౌన్సిలింగ్” ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.
Posted On 2026-06-03 16:08:42
Readmore >
వెంకటసాయి నగర్ కాలనీ లో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-03 15:46:16
Readmore >