షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
సిడబ్ల్యుసి సభ్యులు వంశీచంద్ రెడ్డి తో కలిసి రహదారి పరిశీలన
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణ పాత జాతీయ రహదారి విస్తరణ పనులను వారం రోజుల లోపు ప్రారంభిస్తామని ప్రజల పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని త్వరగా రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం సిడబ్ల్యుసి సభ్యులు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డితో కలిసి పాత జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి పరిశీలించారు. రోడ్డు దుస్థితిని గమనించారు. వారం రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంబంధిత అధికారులతో రోడ్డు నిర్మాణ విషయమై మాట్లాడిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో వారం రోజుల లోపు పాత జాతీయ రహదారి విస్తరణ పనులను చేపట్టబోతున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు.
గతంలో ప్రభుత్వ నిర్లక్ష్యం నిధుల కొరతతో రోడ్డును ఎన్నికలకు ముందు కొంతవరకు వేసి మిగతా పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రస్తుతం సంబంధిత అధికారులతో కాంట్రాక్టర్ తో మాట్లాడడం జరిగిందని పేర్కొన్నారు. రోడ్డు పనులు పూర్తయితే ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొత్తూరు మండల కేంద్రం నుంచి షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ బైపాస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు గత ప్రభుత్వం చేపట్టారు. రూ. 67.75 కోట్ల నిధులతో నాలుగు వరుసల రహదారిని నిర్మించిన నేపథ్యంలో షాద్ నగర్ వరకే పనులు జరిగాయి. కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలో విస్తరణ పనులు పూర్తయ్యాయి. షాద్ నగర్ చౌరస్తా నుండి బైపాస్ రోడ్డు వరకు పనులు చేపట్టాల్సి ఉంది..