ఆర్బీఐ కొత్త రూల్స్ ఇక ఈజీగా బ్యాంక్ లోన్స్..
సిబిల్ స్కోరుతో ఆ చిక్కులు లేకుండా..!
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇప్పటి రోజుల్లో చాలా మంది బ్యాంకు రుణం తీసుకోవాలనుకుంటున్నారు. వ్యక్తిగత అవసరాలు, ఖర్చులు పెరుగుతున్నందువల్ల లేదా కాలం మారుతున్న నేపథ్యంలో బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకోవడం సాధారణంగా మారింది. కానీ ఇక్కడ మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సిబిల్ స్కోర్ (CIBIL Score). మీ సిబిల్ స్కోర్ మంచి స్థాయిలో ఉంటే, మీరు తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందగలరు. కానీ, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్ ప్రకారం, సిబిల్ స్కోర్ సంక్లిష్టతలు లేకుండానే రుణాలు పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
RBI కొత్త రూల్స్:
మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉండి, రుణం దరఖాస్తు తిరస్కరణకు గురైందా? అయితే ఇప్పుడు మీ ఇబ్బందులు కొంతవరకు తీరనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఈ విషయంపై కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రుణం తీసుకోవాలని కోరుకునే వారికి ఇది మంచి వార్త. RBI కొత్త రూల్ ప్రకారం బ్యాంకులు మరియు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు వినియోగదారుల క్రెడిట్ రిపోర్ట్‌ను ప్రతీ 15 రోజులకు ఒకసారి అప్డేట్ చేయాలని ఆదేశించింది. ఇది రుణం పొందాలనుకునే వారికి కొంత ఉపశమనంగా ఉంటుంది. గతంలో, బ్యాంకులు మరియు ఇతర క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీలు ప్రతి 30 రోజులకు క్రెడిట్ రిపోర్ట్‌ను అప్డేట్ చేస్తుండేవి. ఇప్పుడు, 15 రోజులకు తగ్గించడం ద్వారా RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల జరిగిన ద్రవ్య విధాన సమీక్ష అనంతరం ఈ ఆదేశాలను జారీ చేశారు.
ప్రస్తుతం, బ్యాంకులు తమ వినియోగదారుల క్రెడిట్ రిపోర్టులను సిబిల్ మరియు ఎక్విఫాక్స్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీలకు నెలకొకసారి సమర్పించాలి. కానీ, తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చింది. ఇప్పుడు, ప్రతీ 15 రోజులకు ఒకసారి ఈ రిపోర్ట్‌ను అప్డేట్ చేయాలని కోరింది. ఇది రుణం తక్షణం పొందాలనుకునే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే, RBI బ్యాంకులు తమ వినియోగదారుల క్రెడిట్ రిపోర్ట్ ఆధారంగా రుణాలు మంజూరు చేస్తాయి.