| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాలుష్య నివారణకు ఈవీలే శరణ్యం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కాలుష్య నివారణకు ఈవీలే శరణ్యం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

 కొత్తూర్ మండలం తిమ్మాపూర్‌లో ‘ఈడెన్ ఈవీ’ పరిశ్రమ ప్రారంభం

షాద్‌నగర్ పారిశ్రామికవాడలో తొలి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పెరిగిపోతున్న వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగమే ఏకైక మార్గమని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. పారిశ్రామిక హబ్‌గా రూపుదిద్దుకుంటున్న రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం తిమ్మాపూర్‌లో నూతనంగా నెలకొల్పిన ‘ఈడెన్ ఈవీ’ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చిందని, పెట్రోల్, డీజిల్ వాహనాల ఉద్గారాలే ఇందుకు ప్రధాన కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల మేలు కోరి ప్రతి ఒక్కరూ పర్యావరణహిత విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోనే మొట్టమొదటి ఈవీ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కావడం గర్వకారణమని, ఇది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు ప్రాంతీయ పారిశ్రామిక పురోగతికి ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎల్లవేళలా ప్రోత్సాహం అందిస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా యూనిట్ నిర్వాహకులు బి. రవికుమార్, వేమూరి ప్రతాప్, శ్రీనివాస్ రెడ్డిలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈవీల వాడకంతో ఇంధన వ్యయం భారీగా తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ఆహ్వానాన్ని మన్నించి యూనిట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను నిర్వాహకులు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శివశంకర్ గౌడ్, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, సామాజికవేత్త కేకే కృష్ణ, మాజీ జెడ్పీటీసీ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous అగ్రి వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం : వీసీ అల్దాస్ జానయ్యపై మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు... విచారణకు ప్రతిపక్షాల డిమాండ్
Next కామారెడ్డిలో రూ.22 లక్షలతో కొత్త స్కూల్! చైర్‌పర్సన్ చేతుల మీదుగా ఘన ప్రారంభం!
ADVERTISEMENT