షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గంలోని 30 పడకల కేశంపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే షాద్ నగర్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రికి అదనపు నిధులు మంజూరు చేయగలరని అరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ గారిని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. కేశం పేట్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రికి అదనంగా 22.80 లక్షల రూపాయలు కేటాయిస్తే ఉపయోగంలోకి వస్తుందని తెలిపారు. అలాగే షాద్ నగర్ లో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ ఆసుపత్రికి అదనంగా 5.31 కోట్ల రూపాయలు కేటాయిస్తే మార్చరి, మోడ్రన్ కిచెన్,మెకానికల్ లాండ్రి,కాంపౌండ్ వాల్,సీసీ రోడ్డు,పార్కింగ్ షెడ్,బయో మెడికల్ వెస్టేజి భవనం లాంటి నిర్మాణాలు పూర్తి అవుతాయని తెలిపారు.కేశం పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు షాద్ నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం పూర్తి అయితే నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించటానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే అదనపు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.