| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీసీ కులగణన ఆవశ్యకతపై వరంగల్ జిల్లా 2వ మహాసభలు - కుమారస్వామి

బీసీ కులగణన ఆవశ్యకతపై వరంగల్ జిల్లా 2వ మహాసభలు - కుమారస్వామి

డైలీ భారత్, వరంగల్/నల్లబెల్లి :బ్రిటిష్ కాలంలో బీసీ కులాల లెక్కలు తీసి 95 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా లెక్కలను చేపట్టకపోవడం దురదృష్టకరమని బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు.

కీలక పరిస్థితుల్లో జరుగుతున్న బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా 2వ మహాసభలను పురస్కరించుకుని నల్లబెల్లి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీసీ కుల జనగణన చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లు గడిచినా మాట తప్పుతోందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో బీసీ సమాజాన్ని రాజకీయాలకు అతీతంగా ఏకం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని, ఆ లక్ష్యంతోనే వరంగల్ పట్టణంలోని శివనగర్ ఉర్సు జంక్షన్ లో గల రాజశ్రీ గార్డెన్ లో జిల్లా 2వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు మరియు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, కానీ బీసీలకు మాత్రం జనాభాతో సంబంధం లేకుండా అత్యల్ప రిజర్వేషన్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జనాభాపరంగా చాలా తక్కువగా ఉన్న అగ్రవర్ణాలకు ఎలాంటి కులగణన లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. 1992లో ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం దాటి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఆ తీర్పు ప్రాధాన్యత కోల్పోయిందన్నారు.

దేశ జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న బీసీలకు శాస్త్రీయంగా కులగణన చేపట్టి వాటా ఇవ్వడానికి మాత్రం అన్ని అగ్రకుల పార్టీలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ కూడా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగాలలో కనీసం 27 శాతం రిజర్వేషన్లు కూడా పూర్తి స్థాయిలో అందడం లేదని, స్థానిక సంస్థలు, శాసనసభ, పార్లమెంటు, బడ్జెట్ కేటాయింపులలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.

అగ్రకుల రాజకీయ పార్టీలు బీసీలకు సంక్షేమ పథకాల పేరుతో మభ్యపెడుతూ, చట్టసభలను తమ గుప్పిట్లో ఉంచుకుంటున్నాయని విమర్శించారు. దేశంలో చెల్లించే పన్నులలో సగానికి పైగా బీసీలే చెల్లిస్తున్నప్పటికీ, ఆ నిధులను బీసీల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేయకుండా దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. సంపదను సృష్టించే బీసీ కులాలను చదువు, వైద్యం, ఉపాధి రంగాలకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

హిందువులలో 80 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అగ్రవర్ణాల నుండే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ముప్పు ఏర్పడిందని, రాజ్యాంగం మతానికి, రాజ్యానికి సంబంధం లేదని స్పష్టం చేసినప్పటికీ, నేడు మతం పేరుతో మెజార్టీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఉన్న విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు.

ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, పాలకులు కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తున్నారని, ఈ కుట్రలను ఛేదించి రాజ్యాంగాన్ని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలపై ఉందని పిలుపునిచ్చారు.

ఈ మహాసభలను బీసీలు వయోభేదం లేకుండా జయప్రదం చేయాలని, ఎస్సీ, ఎస్టీలను కలుపుకుని రానున్న రోజుల్లో బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించి రాజ్యాధికారం సాధించాలని ఆయన కోరారు.

Previous దసరా, బతుకమ్మ వేడుకలపై గ్రామ సర్పంచులతో పోలీసుల సమీక్ష
Next తెలంగాణ DGP సి.వి. ఆనంద్‌తో US కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ భేటీ... క్రికెట్ బంతిని బహూకరించిన కాన్సుల్ జనరల్
ADVERTISEMENT