| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మానవత్వం చాటిన డ్రైవర్‌కి టీజీఎస్ఆర్టీసీ సన్మానం

మానవత్వం చాటిన డ్రైవర్‌కి టీజీఎస్ఆర్టీసీ సన్మానం

ఆర్టీసీ బస్సులో ప్ర‌యాణికుడికి ఫిట్స్.. డ్రైవ‌ర్ ఉదార‌త

బ‌స్సులోనే ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన డ్రైవ‌ర్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: టీజీఎస్ఆర్టీసీ బ‌స్సులో ఫిట్స్ వ‌చ్చిన ప్ర‌యాణికుడిని ఆస్ప‌త్రిలో చేర్పించి డ్రైవ‌ర్ ఉదార‌త చాటుకున్నారు. బ‌స్సును నేరుగా ఆస్ప‌త్రికి తీసుకెళ్లి ప్ర‌యాణికుడి ప్రాణాల‌ను కాపాడారు. 

వ‌రంగ‌ల్-2 డిపోన‌కు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు సోమవారం వెళ్తోంది. హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ దాట‌గానే సంతోష్ అనే ప్ర‌యాణికుడికి బస్సులో ఒక్కసారిగా ఫిట్స్ వ‌చ్చాయి.  ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్ బి.వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. వెంటేనే బస్సును పక్కకి ఆపి ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని డ్రైవర్ పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని గుర్తించి.. తోటి ప్ర‌యాణికుడు శ్రీనివాస్ స‌హ‌కారంతో సమీపంలో ఉన్న బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి బస్సును తీసుకెళ్లారు. సంతోష్‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు. స‌కాలంలో ఆస్ప‌త్రికి తీసుకువెళ్ల‌డంతో సంతోష్ కు ప్రాణాప్రాయం త‌ప్పింది. 

సమయస్పూర్తితో వ్యవహారించి .. సకాలంలో ప్ర‌యాణికుడిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన ఆర్టీసీ డ్రైవ‌ర్ బి.వెంక‌న్నను హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. సంస్థ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి ఆయ‌న‌ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ స‌న్మానించారు. 

ఆపద సమయంలో  అమూల్య‌మైన సేవాత‌ర్ప‌ర‌త‌ను ఆర్టీసీ సిబ్బంది చాటుతున్నార‌ని స‌జ్జ‌న‌ర్  అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నార‌ని ప్రశంసించారు. సంతోష్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించడంలో డ్రైవ‌ర్‌కి స‌హ‌క‌రించిన ప్ర‌యాణికుడు శ్రీనివాస్‌కు, వైద్యం అందించిన ఎయిమ్స్ వైద్య బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. 

ఈ సన్మాన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ ట్రాఫిక్ మేనేజ‌ర్ శ్రీదేవి, వరంగ‌ల్-2 డిపో మేనేజ‌ర్ జ్యోస్న, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Previous ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకి స్పోర్ట్స్ పరికరాలను అందించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి
Next రౌడీ షీటర్ల పై పోలీస్ నిఘా
ADVERTISEMENT