డైలీ భారత్, స్పెషల్: తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం, ప్రకృతిని దైవంగా భావించే ఏకైక పూల పండుగ "బతుకమ్మ". భాద్రపద అమావాస్య నుంచి ఆశ్వయుజ అష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవం కేవలం రంగుల హరివిల్లే కాదు, మానవ ఆరోగ్యానికి మేలు చేసే ఒక గొప్ప ఔషధ గని.
పండుగ ప్రాశస్త్యం:
బతుకమ్మ అంటే "తల్లీ జీవించు" అని అర్థం. శరదృతువు ఆరంభంలో, వర్షాల తర్వాత చెరువులన్నీ జలకళను సంతరించుకునే వేళ ఈ పండుగ వస్తుంది. మహిళలంతా ఏకమై, తీరొక్క అడవి పూలను సేకరించి, గోపురం ఆకారంలో బతుకమ్మను పేరుస్తారు. పసుపుతో చేసిన గౌరమ్మను అగ్రభాగాన ఉంచి, ప్రకృతిని పూజిస్తూ పాటలు పాడతారు. తొమ్మిది రోజుల పాటు (ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు) నిత్యం ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. చివరగా బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం వెనుక అద్భుతమైన శాస్త్రీయ రహస్యం దాగి ఉంది. బతుకమ్మలో వాడే పూలన్నీ ఔషధ గుణాలు కలిగినవి కావడం వల్ల, అవి నీటిలో నాని జలాలను శుద్ధి చేస్తాయి.
బతుకమ్మ పూలు - శాస్త్రీయ నామాలు & ఔషధ గుణాలు:
1. తంగేడు పువ్వు (సెన్నా ఆరిక్యులేటా): తెలంగాణ రాష్ట్ర పుష్పం. మధుమేహాన్ని అదుపు చేయడంలో, చర్మ వ్యాధులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
2. గునుగు పువ్వు (సిలోసియా అర్జెంటియా): యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ. గాయాలను త్వరగా నయం చేయడానికి, కంటి సమస్యల నివారణకు తోడ్పడుతుంది.
3. పట్టుకుచ్చు పువ్వు (సిలోసియా క్రిస్టాటా): కోడిజుట్టు ఆకారంలో ఉంటుంది. అతిసారం, రక్తహీనత నివారణకు, చర్మ మంటలను తగ్గించడానికి ఆయుర్వేదంలో వాడతారు.
4. గోరింట పువ్వు (లాసోనియా ఇనెర్మిస్): శరీరానికి చలువ చేస్తుంది. యాంటీ-ఫంగల్ గుణాలతో చర్మ ఇన్ఫెక్షన్లు, గోళ్ల వ్యాధులను దూరం చేస్తుంది.
5. మందార పువ్వు (హైబిస్కస్ రోసా-సినెన్సిస్): జుట్టు ఆరోగ్యానికి సంజీవని. గుండె జబ్బుల నివారణకు, అధిక రక్తపోటు నియంత్రణకు దీని రేకుల కషాయం మేలు చేస్తుంది.
6. కట్ల పువ్వు (ఇపోమియా కార్నియా): గాయాలను తగ్గించే గుణం ఉంది. దురదలు, తామర వంటి సమస్యలకు దివ్యౌషధం.
7. బంతి పువ్వు (టాజెటీస్ ఎరెక్టా): యాంటీ మైక్రోబియల్ గుణాలతో చర్మ అలర్జీలను దూరం చేస్తుంది, కీటకాలను వికర్షిస్తుంది.
8. చామంతి పువ్వు (క్రిసాంథిమమ్ ఇండికమ్): శరీరానికి చలువ చేస్తుంది. జలుబు, తలనొప్పి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
9. గుమ్మడి పువ్వు (కుకుర్బిటా పెపో): విటమిన్-ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి కంటి ఆరోగ్యానికి మేలు.
10. బీర పువ్వు (లుఫ్ఫా సిలిండ్రికా): రక్తాన్ని శుద్ధి చేయడానికి, కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
11. తామర పువ్వు (నిలుంబో న్యూసిఫెరా): గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
12. గడ్డి పువ్వు (ట్రైడాక్స్ ప్రోకంబెన్స్): సహజసిద్ధమైన యాంటీ సెప్టిక్. దెబ్బలు తగిలినప్పుడు దీని రసం రాస్తే రక్తం కారడం ఆగిపోతుంది.
ఈ పూలన్నింటినీ కలిపి చెరువులలో నిమజ్జనం చేయడం వల్ల, వర్షాకాలం చివరలో నీటిలో చేరే హానికర బ్యాక్టీరియా నశించి నీరు శుద్ధమవుతుంది. అందుకే "బతుకమ్మ అంటే పర్యావరణ పరిరక్షణతో కూడిన వైజ్ఞానిక వేడుక" అని చెప్పడంలో సందేహం లేదు.
వ్యాస కర్త: మడుపు నవీన్ కుమార్ రెడ్డి, వృక్ష శాస్త్ర ఉపన్యాసకులు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్ల
#Bathukamma #TelanganaCulture #MedicinalFlowers #Bathukamma2026 #DailyBharat #Siricilla