డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : స్టార్ సింగర్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. భారతదేశం పట్ల చిన్మయి మాట్లాడిన అగౌరవమైన, అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కుమార్ సాగర్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళల వేషాధారణపై సీనియర్ నటి అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సింగర్ చిన్మయి శ్రీపాద ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది.
అందులో చిన్మయి శ్రీపాద మాట్లాడుతూ.. భారత దేశాన్ని స్టుపిడ్ కంట్రీ( చెత్త దేశం)గా, భారత దేశంలో పుట్టడం నా ఖర్మ అని చిన్మయి వ్యాఖ్యానించారు. అన్నపూర్ణమ్మకు ఏమైనా చెప్పాలనుకుంటే ఆమె గురించి మాత్రమే చెప్పాలి కానీ భారత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదని కుమార స్వామీ అన్నారు.
భారతదేశంలో ఉంటూ భారతదేశ సౌకర్యాలు అనుభవిస్తూ, భారత దేశపు గాలి పీల్చి, భారత దేశంలో పుట్టడమే ఖర్మ అనడం, భారతదేశం ఒక చెత్త దేశం అని అనటం బాధాకరమన్నారు. బాధ్యత గల పౌరుడిగా భారతదేశం పట్ల అగౌరవమైన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. సింగర్ చిన్మయి శ్రీపాదపై తగిన చర్యలు తీసుకోవాలని కుమారస్వామి కోరారు.
అసలు విషయం ఇదీ..
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా.. ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి. రాత్రి 12 గంటల తర్వాత ఏం పని. ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా.. అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు, మనవైపు కూడా కొంచెం ఉంటుందని వ్యాఖ్యానించింది.
అన్నపూర్ణమ్మ వీడియోపై ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా చిన్మయి ఫైర్ అయ్యింది. తనకు నచ్చిన ఒక నటి ఇలా మాట్లాడడంతో గుండె పగిలినట్లుగా అనిపిస్తుందని, ఆమె చెప్పినట్లుగా ఉంటే అర్ధరాత్రి ఎలాంటి హాస్పిటల్స్, డాక్టర్స్ ఉండరని, వాళ్ళందరూ అమ్మాయిలు కాబట్టి అర్ధరాత్రి ఇంట్లోనే ఉంటారని అంది. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం, సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలని, అర్ధరాత్రి జరిగితే అమ్మాయిలను ఇంట్లోనే ఉంచాలని ఘాటుగా స్పందించింది.
అన్నపూర్ణమ్మ చెప్పినట్లు చేస్తే పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదని, ఇంట్లో వాష్ రూమ్స్ లేక సూర్యోదయానికి ముందు పొద్దున్నే లేచి పొలం గట్టుకు వెళ్తున్న ఆడవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారని, అమ్మాయిల వేషధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నాయని అనుకునే ఇలాంటివారు బతుకుతున్న ఇండియాలో ఆడపిల్లలుగా పుట్టడం మన ఖర్మ అని ఇంకాస్త కటువుగానే మాట్లాడింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే హెచ్ సీయూ విద్యార్థి కుమార స్వామి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.