వేములవాడ, డైలీ భారత్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేపట్టారు.
తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎం. అబూబకర్, భూ భారతి ఆపరేటర్గా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి సంకసాల అనిల్ కుమార్ రూ.8,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారుడి అత్తకు చెందిన వ్యవసాయ భూమిని ఆయన తండ్రి పేరుపై గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు సహకరించే విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ కరీంనగర్లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
తహసీల్దార్ పట్టుబడడంతో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్న బాధితులు!
తహసీల్దార్ ను ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో పలువురు బాధితులు కార్యాలయం ఎదుట పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
రెవెన్యూ అధికారుల వేధింపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, భూములకు సంబంధించి గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్ లేదా వారసత్వ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు అధికారులు నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేసేవారని బాధితులు మీడియాకు తెలిపారు.
ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లంచగొండులపై చర్యలు తీసుకోవడం సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించిందని, ఇకనైనా రెవెన్యూ యంత్రాంగం ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
#Vemulawada ACB Raid, #Tahsildar Arrest, #Rajanna Sircilla News