ఏజెన్సీలో కార్పొరేట్ వ్యవసాయంపై ఆగ్రహం
#ములకలపల్లి, డైలీ భారత్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో 3 రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన వలస కూలి గిరిజన మహిళ పూజారి సోనీ (30) మృతి పట్ల పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరపాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది.
మండల బీజేపీ అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సై కి వినతి పత్రం అందజేశారు.
అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ... వలస కూలి గిరిజన మహిళ అనుమానాస్పదంగా మృతి చెందితే అప్పటికప్పుడే పోస్టుమార్టం చేసి డెడ్ బాడీని తరలించడంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో కార్పొరేట్ వ్యవసాయం పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను తీసుకొచ్చి వారి ప్రాణాలను బలిగొంటున్న బడా రైతులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
పూజారి సోనీ మృతికి గల అసలు కారణాలను నిగ్గు తేల్చేందుకు ఉన్నత స్థాయి విచారణ జరపాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న కార్పొరేట్ వ్యవసాయం మరియు వలస కూలీల శ్రమ దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉపాధి పేరుతో డబ్బు ఆశ చూపి అమాయక గిరిజన వలస కూలీలను తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేస్తున్నారని, లొంగకుంటే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. వలస కూలీలకు భద్రత కల్పించి, వారి మరణాలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ములకలపల్లి బీజేపీ మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్, నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.