నాగర్‌కర్నూల్, వికారాబాద్ కిచెన్లకు రూ.9.17 కోట్ల చెక్కులు అందజేత
డైలీ భారత్, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది. జూబ్లీహిల్స్ నివాసంలో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.
నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ రెండు సంస్థలు సహకారం అందిస్తాయి. నాగర్‌కర్నూల్ కిచెన్ కోసం జున్నా సోలార్ సిస్టమ్స్ CMD శేఖర్ రెడ్డి, CEO అనిల్ బాబు రూ.5.17 కోట్ల చెక్కును, వికారాబాద్ కిచెన్ కోసం చైన్ ల్యాబ్స్ ప్రతినిధి డి.సుమంత్, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ రూ.4 కోట్ల చెక్కును సీఎం చేతుల మీదుగా హరేకృష్ణ ఫౌండేషన్‌కు అందించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దాత సంస్థలను అభినందించారు. డిసెంబర్ 9 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రలైజ్డ్ కిచెన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, నవంబర్ 30లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు కిచెన్లను సందర్శించేలా చూడాలని, విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతిని ట్రాక్ చేయాలని, ఆహారంలో కేలరీలను లెక్కించేందుకు యాప్‌లను వాడాలని సూచించారు. ప్రాంతాల వారీగా అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్ అందించాలని, కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, హరేకృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.