| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్ అభివృద్ధికి రూ.52 వేల కోట్ల మౌలిక వసతులు

హైదరాబాద్ అభివృద్ధికి రూ.52 వేల కోట్ల మౌలిక వసతులు

ప్రజాభవన్‌లో ఆర్టీసీ – మెట్రో’ కామన్ పాస్‌ను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్

రూ.38,000 కోట్లతో మెట్రో ఫేజ్-2... శనివారం కామన్ పాస్‌‌పై ప్రయాణించనున్న మంత్రుల బృందం

డైలీ భారత్ డెస్క్: ప్రజా పాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాలు, శరవేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహానగర సమగ్ర ప్రగతే లక్ష్యంగా రూ.52,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ ), హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) సంయుక్తంగా రూపొందించిన "ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్"ను ఉప ముఖ్యమంత్రి అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంలోనే దాదాపు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆటో ఛార్జీల సవరణకు సంబంధించిన జీఓను కూడా ఆయన సమక్షంలో విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విప్‌లు అద్దంకి దయాకర్, పట్నం మహేందర్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి, మెట్రో సలహాదారు ఎన్.వి.ఎస్. రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రవాణా కమిషనర్ ఇలాంబర్తితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క  మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా పౌర సదుపాయాలను ఇప్పటి నుంచే విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని  పేర్కొన్నారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా పనులు చేసి చూపే నైతికతతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హెచ్‌ఎమ్‌‌డీఏ పరిధిలోనే రూ.35,000 కోట్లతో ఫ్లైఓవర్లు, వంతెనలు, రేడియల్ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, మంచినీటి ప్రాజెక్టులు, అండర్ పాస్‌ల పనులతో కలిపి మొత్తం రూ.52 వేల కోట్ల వ్యయంతో పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.

ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసే క్రమంలో రూ.38,000 కోట్ల అంచనా వ్యయంతో 122 కిలోమీటర్ల మేర మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు. తద్వారా పటాన్‌చెరు, హయత్‌నగర్, ఓల్డ్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతాలకు మెట్రో సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే రూ.30,627 కోట్లతో 362 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణం చేపడుతున్నామని, ఓఆర్‌ఆర్ - ఆర్‌ఆర్‌ఆర్‌లను అనుసంధానించేలా 21 రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 10 రోడ్ల అలైన్‌మెంట్‌కు అనుమతులు ఇచ్చామని, రెండింటి పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మూసీ నది పునరుజ్జీవనానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 55-56 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీని శుద్ధి చేసి నగరానికి పచ్చని వాతావరణాన్ని అందిస్తామని తెలిపారు. కాలుష్య నివారణ కోసం డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని, ఇప్పటికే 550 ఈ-బస్సులు రాగా మరో 2,200 బస్సులను త్వరలోనే ప్రవేశపెడతామన్నారు. ఆటోలను ఈ-ఆటోలుగా మార్చుకునే రెట్రోఫిట్టింగ్ కోసం రూ.200 కోట్లు కేటాయించామని, అంతర్జాతీయ స్థాయిలో 30,000 ఎకరాల్లో "భారత్ ఫ్యూచర్ సిటీ" అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వాల చారిత్రాత్మక పాత్రను గుర్తుచేస్తూ, హైదరాబాద్ తాగునీటి ఎద్దడిని తీర్చడానికి కృష్ణా, గోదావరి, మంజీరా జలాలను తెచ్చింది కాంగ్రెస్ ఏనని స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలకులు నగరానికి ఒక్క చుక్క అదనపు నీటిని కూడా తీసుకరాకపోవడం శోచనీయమన్నారు. ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయం, BHEL, ECIL, DRDO, BDIL, HCU, IIIT వంటి సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని వివరించారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రయాణికులకు ఫస్ట్ మైల్ నుండి లాస్ట్ మైల్ వరకు మెరుగైన కనెక్టివిటీ అందించడానికి ఆర్టీసీ, మెట్రో, ఆటో వ్యవస్థలను సాంకేతికతతో అనుసంధానిస్తున్నామని తెలిపారు. దాదాపు 12 ఏళ్లుగా పెరగని ఆటో ఛార్జీలను ప్రజలపై భారం పడకుండా, డ్రైవర్లకు న్యాయం జరిగేలా సవరించామని చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమానికి త్వరలోనే ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతినెలా ఇచ్చే రూ.300 కోట్లకు అదనంగా మరో రూ.50 కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. విజన్-2047 దిశగా సమగ్ర రవాణా వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వేగంగా అర్బనైజేషన్ జరుగుతున్న హైదరాబాద్‌లో ప్రజా రవాణాను పెంచడం అత్యవసరమన్నారు. మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణ రీయింబర్స్‌మెంట్ కింద ఆర్టీసీకి ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు రూ.12,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆర్టీసీ-మెట్రో సమన్వయంతో ప్రస్తుతం రోజుకు 5 లక్షలుగా ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య 10 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని, రహదారులపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన సొంత నిధులతో రూ.500 విలువ చేసే వన్డే కామన్ పాస్‌లను సీఎం రేవంత్ రెడ్డితో సహా 15 మంది మంత్రుల కోసం కొనుగోలు చేశారు. ఈ కామన్ పాస్ సౌకర్యం, క్షేత్రస్థాయి అనుసంధానాన్ని స్వయంగా పరిశీలించేందుకు శనివారం ఉదయం 10 గంటలకు బేగంపేట మెట్రో స్టేషన్ నుండి మంత్రుల బృందం మెట్రో రైలులో, ఆ తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నట్లు ప్రకటించారు.

Previous ఆరోగ్య భద్రత కోసం రోడ్డెక్కిన వర్కింగ్ జర్నలిస్టులు
Next నూతన బ్రిడ్జి వాయిదాలు వేయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి : తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ
ADVERTISEMENT