| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

పిటిషన్ స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పారదర్శకత – రిసెప్షన్ వర్టికల్ సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం

జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్  

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన రిసెప్షన్ వర్టికల్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి పలు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లకు అందించే ప్రతి పిటిషన్‌ను ఎలాంటి ఆలస్యం లేకుండా CCTNSలో నమోదు చేసి, పిటిషన్‌దారుడికి వెంటనే రిసీప్ట్ అందించాలని రిసెప్షన్ వర్టికల్ అధికారులను ఆదేశించారు. పిటిషన్ స్వీకరించిన వెంటనే వివరాలను సక్రమంగా నమోదు చేసి, తదుపరి చర్యలను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.

ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా, మర్యాదపూర్వకంగా, పారదర్శకంగా వ్యవహరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ  అన్నారు. పిటిషన్లను పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత అధికారులు సత్వరమే పరిశీలించి, చట్టపరమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా సైబర్ నేరాల బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించాలని ఆదేశించారు. సైబర్ నేరాలకు గురైన బాధితులకు సత్వర సహాయం అందిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

ప్రజలకు పోలీస్ శాఖ అందించే సేవల్లో వేగం, పారదర్శకత, బాధ్యత ప్రధానంగా ఉండాలని ఎస్పీ  స్పష్టం చేశారు. రిసెప్షన్ వర్టికల్ ప్రజలకు పోలీస్ శాఖతో తొలి పరిచయ వేదికగా ఉంటుందని, అందువల్ల ప్రతి సిబ్బంది ప్రజల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్‌తో పాటు రిసెప్షన్ వర్టికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Previous మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ
Next మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...
ADVERTISEMENT