| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

శుక్రవారం గర్గుల్‌లో "ఎకో సెన్స్" ప్రాజెక్టుపై ప్రత్యేక వర్క్‌షాప్

పక్షుల రియల్‌టైమ్‌ పర్యవేక్షణపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు శిక్షణ

డైలీ భారత్, కామారెడ్డి : గర్గుల్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రోత్సాహంతో, జిల్లా సైన్స్ అధికారి ఎం. సిద్ధిరామ్ రెడ్డి ఆధ్వర్యంలో గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘ఎకో సెన్స్ ప్రాజెక్ట్’ నమూనాపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధానాలపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిసర ప్రాంతాల్లో సంచరించే వివిధ రకాల పక్షులను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడం, పక్షుల ధ్వనుల ఆధారంగా వాటిని గుర్తించడం, అవి కనిపించిన సమయాన్ని నమోదు చేయడం, నిర్దిష్ట ప్రాంతంలో పక్షుల సంచారాన్ని గుర్తించడం వంటి అంశాలపై శిక్షణ అందించారు.

రాస్ప్‌బెర్రీ పై సాంకేతికతను ఉపయోగించి పక్షుల ధ్వనులను గుర్తించడం, వాటి వివరాలను సేకరించడం, సమాచారాన్ని నమోదు చేసి విశ్లేషించడం వంటి అంశాలను ప్రాక్టికల్‌గా వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రాజెక్టులను రూపొందించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సృజనాత్మకంగా వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మరింత సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు.

జీవవైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్ పాఠశాలల్లో ఇలాంటి ‘ఎకో సెన్స్’ నమూనాలను ఏర్పాటు చేసి, విద్యార్థులను పర్యావరణహిత సాంకేతిక ప్రాజెక్టుల వైపు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మల్లికార్జున్, మండల విద్యాధికారి ఎల్లయ్య, జిల్లా సైన్స్ అధికారి ఎం. సిద్ధిరామ్ రెడ్డి, స్థానిక అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్‌చార్జి బాలగంగాధర్, సోహం రోబోటిక్స్ ప్రతినిధులు, వివిధ పాఠశాలల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Previous "ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...
Next మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ
ADVERTISEMENT