డైలీ భారత్, బీబీపేట: ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్న మాట ఏమైందని బీబీపేట్ మండల్ తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త నరసింహులు ప్రశ్నించారు.
ఆయన ప్రెస్ నోట్ విడుదల చేస్తూ మాట్లాడుతూ... బీబీపేట్ మండలంలో, ముఖ్యంగా బీబీపేట్ విలేజ్ లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇక్కడ జనాభా 8 వేలకు పైగా ఉందని, ఇప్పటివరకు కనీసం 3 ఇళ్లు కూడా మంజూరు కాలేదని, ఇది చాలా బాధాకరమని అన్నారు.
గ్రామంలో ఇప్పటికీ చాలా చోట్ల గుడిసెలు, రేకుల ఇళ్లు, పెంకుల ఇళ్లే కనిపిస్తున్నాయని, బంగ్లాలు ఉన్నది ఒకటి రెండు చోట్ల మాత్రమేనని తెలిపారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.75 వేలు, సిమెంట్, ఇసుక, కంకర ఇచ్చి ఇల్లు కట్టించేవారని గుర్తు చేశారు. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, ఇప్పుడు రూ.5 లక్షల సాయం అంటున్నారని, కానీ క్షేత్ర స్థాయిలో ఒక్క ఇల్లు కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, లేదా ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సామాగ్రిని అందించాలని డిమాండ్ చేశారు.
బీబీపేట్ విలేజ్ లాంటి మారుమూల ప్రాంతంలో పేదలు ఎక్కువగా ఉన్నారని, కనీసం 200 ఇళ్లు అయినా వెంటనే మంజూరు చేయాలని కోరారు. కొద్ది రోజుల్లో మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని, అప్పటిలోగా హామీ నెరవేర్చకపోతే ప్రజలు నమ్మరని అన్నారు.
ప్రతి పేదవాడికి ఇల్లు కల్పించే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.