| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నైజాం కాలం నాటి బీబీపేట చెరువును నింపండి... 7 గ్రామాల రైతుల గోస పట్టించుకోరా?

నైజాం కాలం నాటి బీబీపేట చెరువును నింపండి... 7 గ్రామాల రైతుల గోస పట్టించుకోరా?

మాజీ ఎంపీటీసీ భర్త కొరివి నరసింహులు డిమాండ్

బీబీపేట / కామారెడ్డి (డైలీ భారత్): బీబీపేటలోని చారిత్రక గొలుసుకట్టు చెరువును వెంటనే నింపి రైతులను ఆదుకోవాలని బీబీపేట తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త, జిల్లా ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

500 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఈ చెరువు నైజాం కాలం నాటిదని, దీని కింద వేల ఎకరాల్లో రైతులు సాగు చేసుకుంటూ బతుకుతున్నారని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఈ చెరువు కింద తమలపాకు తోటలు ఎంతో ప్రసిద్ధి చెందాయని, ఇక్కడి తమలపాకులు లారీల ద్వారా కలకత్తా వరకు ఎగుమతి అయ్యేవని, బీబీపేట తమలపాకు అంటేనే ఒక బ్రాండ్ గా ఉండేదని గుర్తు చేశారు.

గొలుసుకట్టు చెరువు కావడంతో నైజాం కాలంలోనే దీనికి తూములు, గొలుసుకట్టు కాలువలు నిర్మించారని, కానీ నేడు ఈ చెరువును పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

మల్లన్నసాగర్ నుండి బీబీపేట చెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా పెద్ద పైప్‌లైన్ ద్వారా నీళ్లు నింపుతామని 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చిందని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇచ్చిన హామీలు ఎటుపోయాయని ఆయన ప్రశ్నించారు.

ఈ చెరువు నిండకపోవడం వల్ల ఇసానగర్, ఉప్పరపల్లి, నస్కల్ షేర్, బీబీపేట, తుజల్పూర్, మల్కాపూర్, యాడారం తదితర 7 గ్రామాల రైతులు వేల ఎకరాల్లో పంటలు పండక కూలీ పనులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని తెలిపారు.

కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దృష్టి సారించి మల్లన్నసాగర్ నుండో లేదా మరో మార్గం ద్వారానో ఈ చెరువుకు కనీసం 1 టీఎంసీ నీరు వచ్చేలా చూడాలని, గొలుసుకట్టు చెరువులను కాపాడాలని ఆయన ప్రెస్ నోట్ ద్వారా డిమాండ్ చేశారు.

Previous జాతీయ రహదారి 44 వెంట ఆహార సంస్థల్లో టీజీ సేఫ్ ప్రత్యేక తనిఖీలు - ఆరు రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్
Next నేను సైతం కవితక్క తెలంగాణ రక్షణ సేనలో... 90 ఏళ్ల వృద్ధురాలి చేరికతో సంచలనం
ADVERTISEMENT