| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

మహబూబాబాద్ జిల్లాలో సంచలనం

డైలీ భారత్, చిలుకోడు (డోర్నకల్లు): "ఎలాగైనా నా భర్తను చంపు.. లేకపోతే నేను చనిపోతా" అంటూ ఓ భార్య తన ప్రియుడికి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన మెసేజ్‌లు మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపాయి. డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామంలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

సూర్యాపేట జిల్లాకు చెందిన భవాని అనే మహిళకు, చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావుతో 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, కొంతకాలంగా భవాని.. సైదులు అనే కొరియర్ బాయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్తా గత నెల 27న భర్త రాజేశ్వరరావుకు తెలిసింది. దీనిపై ఆయన పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టించారు.

పంచాయితీ జరిగిన తర్వాత, రాజేశ్వరరావు తన అన్నను తీసుకురావడానికి బయటకు వెళ్తుండగా ప్రియుడు సైదులు అతడిని వెంబడించాడు. సైదులు ప్రవర్తనపై అనుమానం వచ్చిన రాజేశ్వరరావు, అతడి నుంచి తప్పించుకుని వెంటనే ఇంటికి తిరిగి వచ్చారు. భార్య భవాని మొబైల్ ఫోన్ తీసుకుని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను తనిఖీ చేశారు. అందులో భవాని తన ప్రియుడు సైదులుకు పంపిన చాటింగ్ చూసి ఆయన ఒక్కసారిగా ఖంగుతిన్నారు. "ఎలాగైనా నా భర్తను చంపేయ్.. లేదంటే నేనే చనిపోతాను" అంటూ ఆమె మెసేజ్‌లు పంపినట్లు ఆధారాలు దొరికాయి.

తన ప్రాణాలకే ముప్పు ఉందని గ్రహించిన రాజేశ్వరరావు.. ఆ చాటింగ్ స్క్రీన్‌షాట్లను సాక్ష్యాలుగా తీసుకుని డోర్నకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మొదట పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన మరోసారి రూరల్ సీఐని కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. స్పందించిన రూరల్ సీఐ.. వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన దర్యాప్తు జరుపుతామని, బాధితుడికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Previous నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి
Next హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
ADVERTISEMENT