Posted on 2026-07-30 13:03:09
ఆపరేషన్ కవచ్ ద్వారా నిరూపణ, విజయవంతంగా ఏడాది పూర్తి.
ప్రజలకు రక్షణ కవచంలా, కొండంత ధైర్యంలా
కామారెడ్డి పోలీసుల ఏడాది ఆదర్శ ప్రస్థానం.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ దిశానిర్దేశంలో "ఆపరేషన్ కవచ్" విజయవంతంగా ఏడాది పూర్తి. కామారెడ్డి పోలీసుల అచంచల విశ్వాస ప్రస్థానం.
డైలీ భారత్, కామారెడ్డి :రాత్రి వేళల్లో జగమంతా నిశ్శబ్దంగా నిద్రకు ఉపక్రమిస్తుంది. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించిన సామాన్యుడు హాయిగా కనుమూసేవేళ అది. కానీ, అదే సమయంలో నల్లని చీకట్లను చీల్చుకుంటూ, కంటిమీద కునుకు లేకుండా కాపలా కాసే రక్షక పోలీసులు రోడ్లపైకి వస్తారు. వర్షం కురుస్తున్నా, చలి వణికిస్తున్నా.. ప్రజల భద్రతే పరమావధిగా రోడ్లపై పహారా కాసే ఖాకీ సైన్యం అది. కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీయస్ దిశానిర్దేశంలో ప్రీవెంటివ్ పోలీసింగ్ (నేర నియంత్రణ) వ్యూహంతో సరిగ్గా ఏడాది క్రితం 25 జులై 2025 నాడు ప్రారంభమైన “ఆపరేషన్ కవచ్” (Operation Kavach) 24 జులై 2026 నాటికి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.
ఈ ఏడాది కాలంలో ఈ వినూతన ఆపరేషన్ నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూనే, ప్రజలకు నమ్మకమైన రక్షణ కవచంగా నిలిచింది. ప్రజలు సుఖంగా నిద్రపోవడానికి పోలీసులు రాత్రంతా నిద్రలేని క్షణాలు గడుపుతూ చేసే వాహన తనిఖీలు కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అవి ప్రజల ఆస్తి, ప్రాణాలకు, యువత చెడు దారి పట్టకుండా భరోసా ఇచ్చే అభేద్యమైన కోటలుగా నిలిచాయి.
ఏడాది కాలంలోని ప్రధాన సంఘటనలు.
• గంజాయి నిరోధక చర్యలు:
o 6 NDPS కేసులు నమోదు.
o 18 మంది నిందితుల అరెస్టు.
o సుమారు 403.405 కిలోల గంజాయి (విలువ సుమారు రూ. 2.01 కోట్లు) స్వాధీనం.
• అక్రమ రవాణా నిరోధం:
o 11 అక్రమ ఇసుక రవాణా కేసులు (8 లారీలు, 3 ట్రాక్టర్లు స్వాధీనం).
o 3 అక్రమ పశువుల రవాణా కేసులు నమోదు.
o 3 పీడీఎస్ (PDS) బియ్యం అక్రమ రవాణా కేసులు.
o 1 గుట్కా రవాణా కేసు (మొత్తంగా రూ. 43 లక్షల నగదు స్వాధీనం).
• మోటార్ సైకిళ్లు దొంగతనాలు, ఆయుధాలు అక్రమ వినియోగం రికవరీ:
o 18 దొంగిలించిన మోటార్ సైకిళ్లు స్వాధీనం.
o 5 దేశీయ తుపాకులు, 1 ఎయిర్ గన్ స్వాధీనం.
o ఆలయ దొంగతనాలు, ఆస్తి నేరాలు, ఏటీఎం దొంగతనం కేసులు ఛేదించబడి అంతర్‌రాష్ట్ర నేర ముఠాల అరెస్టు.
• మానవీయ కోణం:
o 14 ఏళ్ల బాలుడు మానసికముగా ఆందోళన చెంది సైకిల్ పై గమ్యం లేని ప్రయాణం చేస్తుండగా సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగింత.
• ఎన్‌ఫోర్స్‌మెంట్ వివరాలు:
o మొత్తం 5,16,984 వాహనాల తనిఖీలు.
o 1,19,052 మందిని పాపిలాన్ పరికరం ద్వారా పరిశీలన.
o 209 మంది అనుమానితుల గుర్తింపు.
o 3,572 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు.
• నేరాల అణచివేత:
o అంతర్‌రాష్ట్ర నేర ముఠాల కార్యకలాపాలు 12 నుండి 2 కి తగ్గింపు.
o 5 మంది అంతర్‌జిల్లా నేరస్థుల గుర్తింపు.
కోట్ల విలువైన గంజాయి రవాణా భగ్నం: యువత భవిష్యత్తుకు రక్ష
ఇలాంటి మెరుపు వేగమే డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపడంలోనూ కనిపించింది. నేటి యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ సంస్కృతిని సమూలంగా తుడిచిపెట్టడమే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారు. ఒడిశా నుండి మహారాష్ట్రలోని నాసిక్‌కు పనసపండ్ల వ్యాపారం మాటున తరలిస్తున్న భారీ గంజాయి రవాణాను అడ్డుకోవడానికి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ కవచ్ ప్రత్యేక బృందాలు జాతీయ రహదారి-44 పై పక్కా వ్యూహంతో నిఘా పెట్టాయి. క్యాసంపల్లి రాయల్ ధాబా వద్ద అనుమానాస్పద వాహనాన్ని ఆపి, పనసపండ్ల కింద దాచిన సుమారు 387.128 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ గంజాయి విలువ అక్షరాలా కోటి తొంభై మూడు లక్షల రూపాయలకు పైమాటే. స్మగ్లర్లు ఎంత తెలివిగా ప్లాన్ వేసినా కామారెడ్డి పోలీసుల ఆపరేషన్ కవచ్ నిశిత నేత్రాల ముందు తలవంచక తప్పలేదు.
అదే విధంగా, నర్సన్నపల్లి చౌరస్తా వద్ద తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా రాత్రి డ్యూటీ చేస్తున్న పోలీసులు అనుమానాస్పద ఆటోను తనిఖీ చేసి, సీట్ల క్రింద దాచి తరలిస్తున్న గంజాయిని పట్టుకుని ముగ్గురిని కటకటాల్లోకి నెట్టారు. ఈ తనిఖీలు కేవలం కేసులు పెట్టడానికి కాదు, కొన్ని వందల మంది యువకుల జీవితాలు గంజాయి బారిన పడకుండా, వారి తల్లిదండ్రుల కలలు సాకరం చేయడానికే అని కామారెడ్డి ఆపరేషన్ కవచ్ పోలీసులు నిరూపించారు.
అడవి జంతువుల వేటగాళ్ల ముఠా గుట్టురట్టు: ప్రకృతి సంరక్షణనే ధ్యేయం
నేరగాళ్లనే కాకుండా అడవి జంతువులను వేటాడే ప్రమాదకర ముఠాల ఆటకట్టించడంలోనూ ఆపరేషన్ కవచ్ విజయవంతమైంది. గాంధారి పోలీసులు రాత్రి వేళ మొండి సడక్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ, పోలీసులను చూసి పారిపోతున్న వేటగాళ్లను వెంబడించి పట్టుకున్నారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీ. శ్రీనివాస రావు గారి పర్యవేక్షణలో సాగిన ఈ ఆపరేషన్‌లో (8) మంది సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని, వారి నుండి (5) నాటుతుపాకులు, (1) ఎయిర్ గన్, భారీగా వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల మనుగడకు ముప్పు తెచ్చే ఇలాంటి ముఠాల నెట్‌వర్క్ ధ్వంసం చేయడం ద్వారా పోలీసులు పర్యావరణ పరిరక్షణలో తమ నిబద్ధతను ఆపరేషన్ కవచ్ ద్వారా చాటుకున్నారు.
యజమానికి తెలియక ముందే దొంగలించిన ట్రాక్టర్ రికవరీ: బాధ్యతాయుత పోలీసింగ్‌కు నిదర్శనం
ఈ నిరంతర తనిఖీల వెనుక ఉన్న పోలీసుల నిశిత దృష్టికి నిదర్శనంగా నిలిచింది పోసానిపేట ట్రాక్టర్ దొంగతనం ఉదంతం. రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన బండి పెంటయ్య అనే రైతు తన ట్రాక్టర్‌ను వ్యవసాయ పొలం షెడ్డు వద్ద ఉంచగా, జైలులో పరిచయమైన ఘరానా దొంగలు గండ్ర స్వామి, వడ్ల విజయ్ కుమార్ తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తాళాలు పగులగొట్టి దాన్ని దొంగిలించారు.
కానీ, వారి దురాశ ఎక్కువ సేపు సాగలేదు. సరిగ్గా రెండు గంటల వ్యవధిలో సదాశివనగర్ పద్మజీవాడి ఎక్స్ రోడ్ వద్ద ఆపరేషన్ కవచ్ తనిఖీల్లో ఉన్న గాంధారి ఎస్సై బి. ఆంజనేయులు, వారి సిబ్బంది వెంకటరాములు, హరిలాల్, అహ్మద్ షరీఫ్, రాములు అత్యంత అప్రమత్తతతో ఆ ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. నిందితులను తమదైన శైలిలో విచారించడంతో అసలు దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ దొంగతనానికి గురైందనే విషయం యజమాని పెంటయ్యకు తెలవక ముందే, పోలీసులు ఆ ఐదు లక్షల విలువైన ట్రాక్టర్‌ను రికవరీ చేసి యజమాని ముందు ఉంచారు. ఇది కామారెడ్డి పోలీసుల వేగవంతమైన పనితీరుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
హాలీవుడ్ రేంజ్ మిడ్‌నైట్ చేజింగ్: ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణ
పోలీసులు ప్రజలతో ఎంతలా మమేకమవుతారో, ప్రజలకు పోలీసులు ఎంత దగ్గరయ్యారో చూపించే మరో ఉత్కంఠభరిత పోలీస్ చేజింగ్ సంఘటన నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అర్ధరాత్రి వేళ ఆటో దొంగిలించి పారిపోతున్న ఘరానా దొంగలను పోలీస్ సిబ్బంది గుర్తించగా, దొంగలు బైక్‌లపై పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది చీకటిని చీల్చుకుంటూ 8-కిలోమీటర్ల మేర వారిని వెంబడించగా, పోలీసులకు అండగా మాల్తుమ్మెద, పోచారం, జక్కన్నపేట గ్రామస్తులు, యువకులు చేతుల్లో టార్చ్ లైట్లతో రోడ్లపైకి వచ్చారు. ప్రజలు & పోలీస్ సమన్వయంతో సాగిన ఈ ఉమ్మడి వేటలో 43 కేసుల హిస్టరీ ఉన్న ప్రధాన దొంగ చింతా బలరాజ్ సహా నలుగురిని వెంటాడి పట్టుకున్నారు. దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది పోలీసులపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకానికి ప్రతీక.
దేవాలయ చోరీ కేసు గంటల వ్యవధిలోనే ఛేదనం: ప్రజల విశ్వాసమే పరమావధి
దేవాలయాల పవిత్రతను దెబ్బతీసే దొంగల ఆటను కూడా పోలీసులు ముగించారు. సదాశివనగర్ ఎల్లమ్మ గుడిలో చోరీ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పాత నేరస్థులను పద్మాజీవాడి వద్ద పట్టుకుని, అమ్మవారి వెండి కండ్లు, హుండీ నగదును రికవరీ చేశారు. అలాగే, లింగాపూర్ గ్రామంలో జరిగిన దోపిడీ కేసులో డయల్-100 సమాచారంతో కంట్రోల్ రూమ్ అలర్ట్ అయి, జియో ఫెన్సింగ్ పద్ధతిలో నిందితుడి డ్రెస్ కోడ్ ఆధారంగా వసుంధర వెంచర్ చెక్‌పోస్ట్ వద్ద రాథోడ్ బొజ్జు అనే పాత నేరస్థుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆస్తులకు నమ్మకమైన కాపలాదారులుగా తామున్నామని పోలీసులు నిరూపించారు.
ఖాకీ గుండెల్లోని మానవత్వం: బాధ్యతాయుతమైన ఆత్మీయ స్పందన
ఖాకీ దుస్తుల వెనుక దాగి ఉన్న మానవీయ కోణాన్ని ఆవిష్కరించే ఘటనలు కూడా ఆపరేషన్ కవచ్‌లో ఎన్నో ఉన్నాయి. తల్లి మందలించిందని మనస్తాపంతో నిజామాబాద్ నుండి సైకిల్‌పై 50Km ప్రయాణించి, అర్ధరాత్రి వేళ టేక్రియాల్ జంక్షన్ వద్ద ఒంటరిగా, ప్రమాదకర స్థితిలో ఉన్న 14 ఏళ్ల బాలుడిని దేవునిపల్లి ఏరియాలో ఆపరేషన్ కవచ్ పోలీసులు గమనించారు. ఆ అబ్బాయిని ప్రేమతో దగ్గరకు తీసి, అన్నం తినిపించి, కౌన్సెలింగ్ ఇచ్చి తెల్లవారేసరికి కంగారుపడుతున్న తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఆ సమయంలో ఆ తల్లిదండ్రుల కళ్లలో కనిపించిన ఆనంద బాష్పాలు పోలీసుల సేవా నిరతికి దక్కిన గొప్ప పురస్కారాలు. శాంతిభద్రతల పరిరక్షణే కాదు, కుటుంబాల ఆనందం కూడా పోలీసులకు ముఖ్యమేనని ఈ ఘటన నిరూపిస్తుంది.
జాతీయ రహదారి NH-44 పై ప్రాణాల రక్షణ... నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోలీసుల యుద్ధం
ఇక రహదారి భద్రత విషయానికి వస్తే, మద్యం మత్తులో వాహనాలు నడిపే డ్రైవర్ల వల్ల అమాయక ప్రయాణికులు బలి కాకుండా ఆపరేషన్ కవచ్ నిరంతరం అడ్డుకుంటోంది. భిక్నూర్ టోల్‌ప్లాజా వద్ద ఎన్‌హెచ్-44 పై నిర్వహించిన ఒకే ఒక్క ప్రత్యేక డ్రైవ్‌లో పోలీసులు ఏకంగా 1,139 వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో శబ్రీజ్ ఖురానా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాగి వాహనం నడుపుతుండగా పట్టుకున్నారు. బస్సులో ఉన్న 45 మంది అమాయక ప్రయాణికులను సురక్షితంగా వేరే బస్సులోకి తరలించి, సదరు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
అలాగే, కామాక్షి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో భిక్నూర్ సమీపంలో రోడ్డు భద్రతా డ్రమ్స్‌ను ఢీకొట్టిన ప్రమాదంలోనూ పోలీసులు తక్షణమే స్పందించి, బస్సులో ఉన్న ముప్పై మంది ప్రయాణికులను రక్షించి సురక్షితంగా పంపించారు. ఆ రాత్రి మొత్తం ఇరవై ఏడు మంది మందుబాబు డ్రైవర్లపై కేసులు నమోదు చేయడం ద్వారా ఎందరో కుటుంబాలలో వెలుగులు నిలిపారు.
"చెక్కింగ్ ప్రజల రక్షణ కొరకే... సహకారం యువత భవిష్యత్తు కోసమే!"
ఈ ఏడాది కాలంలో సాధించిన అపూర్వ విజయాల వెనుక ఉన్న కామారెడ్డి పోలీసుల అసలు నినాదం "ప్రజలకు భరోసా-నేరస్థులకు భయం". ఈ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ జిల్లా ప్రజలకు ఒక ఆత్మీయ భరోసా సందేశాన్ని ఇచ్చారు.
"రహదారులపై రాత్రి వేళల్లో పోలీసులు చేసే వాహన తనిఖీలు (Checking) సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదని, అవి కేవలం నేరస్థులను, అక్రమ రవాణా, ఆయుధాలను పట్టుకోవడానికి మాత్రమేనని గ్రహించాలి. ప్రతి ఒక్కరూ తమ బిడ్డ క్షేమంగా ఇల్లు చేరాలని, తమ సంపాదన ఇతరుల పాలు కాకుండా ఉండాలని కోరుకుంటారు. ఆ కోరికలను పోలీసులు నిజం చేస్తూ రక్షణ, భద్రత కల్పిస్తున్నారు. నేటి యువత ఉజ్వల భవిష్యత్తును చెడు మార్గాల వైపు వెళ్లకుండా కాపాడటమే మా ప్రథమ కర్తవ్యం. పోలీసులు రాత్రంతా నిద్ర లేకుండా రోడ్లపై గడుపుతున్నది కేవలం ప్రజల ప్రశాంత నిద్ర కోసమే. మీ భద్రత - మా బాధ్యత."
యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్, జిల్లా ఎస్పీ
ఈ ఆపరేషన్లలో అసాధారణ ప్రతిభ చూపిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ స్వయంగా కార్యాలయానికి పిలిపించి నగదు పురస్కారాలతో సత్కరించడం వారి బాధ్యతను మరింత పెంచింది. ఆపరేషన్ కవచ్ అనేది కేవలం ఒక తనిఖీ కార్యక్రమం మాత్రమే కాదు.. గడిచిన సంవత్సర కాలంగా కామారెడ్డి జిల్లా ప్రజల సుఖసంతోషాల వెనుక నిలిచిన అభేద్యమైన రక్షణ కవచం అని తెలియజేశారు.
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >
వందేమాతరం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం... జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణ
Posted On 2026-07-30 12:57:14
Readmore >
సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు
Posted On 2026-07-30 08:32:38
Readmore >
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >